ఒక్క సంతకం పెట్టి శ్రీవారిని జగన్ దర్శనం చేసుకోవచ్చు : రఘునందన్ రావు

ఠాగూర్

శనివారం, 28 సెప్టెంబరు 2024 (19:51 IST)
హైందవ ధర్మం ప్రకారం శ్రీవారి దర్శనం కోసం వెళ్లే వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి తితిదే డిక్లరేషన్‌లో ఒక్క సంతకం చేసి స్వామివారిని దర్శనం చేసుకోవచ్చని భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర నేత, ఎంపీ రఘునందన్ రావు సూచించారు. ఒక్క సంతకం పెట్టి శ్రీవారిని దర్శనం చేసుకోవడానన్ని ఎవరైనా అడ్డుకుంటారా అని ఆయన ప్రశ్నించారు. 
 
మాజీ సీఎం జగన్ తిరుమల శ్రీవారి దర్శనం వివాదం కావడంపై రఘునందన్ రావు స్పందించారు. 'జగన్ రాకను మేమెవ్వరం అడ్డుకోం. మీరు తిరుమలకు రండి.. మాజీ సీఎం జగన్‌కు ఇదే మా ఆహ్వానం. కానీ డిక్లరేషన్‌‍పై సంతకం చేయాల్సిందే' అని స్పష్టం చేశారు.
 
ఒక మాజీ సీఎంనే గుడిలోకి రానివ్వకపోతే ఇక దళితుల పరిస్థితి ఏమిటని జగన్ చేసిన వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. జగన్ చేసిన వ్యాఖ్యలను ఎంపీ తప్పుబట్టారు. అసలు డిక్లరేషన్‌పై ఎక్కడ సంతకం పెట్టవలసి వస్తుందోననే ఆలోచనతోనే జగన్ తన తిరుమల పర్యటనను రద్దు చేసుకున్నారన్నారు.
 
డిక్లరేషన్ నిబంధన ఒక్క జగన్‌కు మాత్రమే కాదని, ప్రతి ఒక్కరికీ వర్తిస్తుందనే విషయం తెలుసుకోవాలన్నారు. తాను ఐదుసార్లు తిరుమల వెళ్లి పట్టువస్త్రాలు సమర్పించానని జగన్ చెబుతున్నారని, కానీ ఆయన సీఎంగా వెళ్లాడని తెలిపారు. సీఎం కాకముందు పాదయాత్రలో భాగంగా తిరుమల వెళ్లారని గుర్తు చేశారు.
 
కానీ ఈ రోజు లడ్డూ ప్రసాదం అపవిత్రంపై విమర్శలు వస్తున్న సమయంలో ఆయన తిరుమల వస్తానని చెప్పారని తెలిపారు. అందుకే శ్రీవారి భక్తులు, హిందూ సమాజం డిక్లరేషన్ ఇవ్వాలని కోరుతోందన్నారు. తిరుమల వెంకన్న దర్శనం చేసుకోవడానికి డిక్లరేషన్ ఇస్తే సరిపోతుంది కదా అన్నారు. కానీ డిక్లరేషన్‌కు ఎందుకు వెనుకాడుతున్నారని విమర్శించారు. 
 
చర్చిల యజమానులతో లేదా పాస్టర్లతో లేదా విదేశాల నుంచి వచ్చే నిధుల్లో ఇబ్బందులు వస్తాయని భావించి జగన్ డిక్లరేషన్‌‍పై సంతకం పెట్టడానికి ఆసక్తి చూపించడం లేదా? అని నిలదీశారు. నిత్యం లక్షలాది భక్తులు శ్రీవారిని దర్శించుకుంటారని, ఇందులో వేలాదిమంది దళితులు ఉంటారన్నారు. కానీ జగన్ ఇక్కడ కుల పంచాయితీని ఎందుకు తీసుకు వస్తున్నాడని మండిపడ్డారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు