తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల తర్వాత భారత రాష్ట్ర సమితిలో కల్లోలం చెలరేగింది. ఆ పార్టీకి చెందిన అనేక మంది ప్రజాప్రతినిధులు తమ పదవులను వదులుకుని అధికార కాంగ్రెస్, బీజేపీల్లో చేరేందుకు అమితాసక్తిని చూపుతున్నారు. ఇప్పటికే పలువురు ప్రజా ప్రతినిధులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. మరికొందరు బీజేపీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో ఆ పార్టీ సీనియర్ నేత, వరంగల్ జిల్లా పార్టీ అధ్యక్షుడు ఆరూరి రమేష్ కాషాయం కండువా కప్పుకున్నారు. ఆదివారం ఉదయం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సమక్షంలో ఆయన బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా ఆరూరి రమేశ్ మాట్లాడుతూ పదేళ్లుగా దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న ప్రధాని మోడీ ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డితో కలిసి పని చేయనున్నట్టు ప్రకటించారు. వరంగల్ జిల్లాలో బీజేపీ కార్యకర్తలతో కలిసిపోయి పార్టీ కోసం పని చేస్తానని చెప్పారు. ఈ కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర నేతలు పలువురు హాజరుకావాల్సివుండగా, లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో నిమగ్నమైవుండటంతో వారు రాలేకపోయారని తెలిపారు. బండి అరవింద్, ఈటల రాజేందర్‌లను ప్రత్యేకంగా కలుస్తానని తెలిపారు.
కాగా, ఆరూరి రమేశ్ పార్టీ మారడం సందర్భంగా ఇటీవల పలు నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. వాస్తవానికి రెండు మూడు రోజుల కిందటే ఆరూరి బీజేపీలో చేరేందుకు రంగం సిద్దం చేసుకున్నారు. ఈమేరకు మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతుండగా బీఆర్ఎస్ నేతలు వచ్చి బలవంతంగా ఆయనను వరంగల్ నుంచి హైదరాబాద్ కు తరలించారు. ఈ సందర్భంగా జనగాం వద్ద బీజేపీ నేతలు కారును అడ్డుకున్నారు. ఆరూరి రమేశ్ ను బీఆర్ఎస్ నేతల నుంచి విడిపించే ప్రయత్నంలో ఆయన చొక్కా చిరిగింది. దీంతో కన్నీళ్లతో నమస్కరిస్తూ తనను వెళ్లనివ్వాలని ఆరూరి ప్రాధేయపడ్డారు.
అనంతరం హైదరాబాద్ లో మాజీ సీఎం కేసీఆర్ తో భేటీ అయి బయటకు వచ్చాక మీడియాతో మాట్లాడారు. తాను బీఆర్ఎస్ లోనే కొనసాగుతానని, లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయబోనని ప్రకటించారు. బీజేపీలో చేరతాననే ప్రచారం అంతా వట్టిదేనని వివరించారు. కేసీఆర్ తో భేటీ అయిన మరుసటి రోజే ఆరూరి రహస్యంగా ఢిల్లీకి వెళ్లి బీజేపీ పెద్దలతో భేటీ అయ్యారు. శనివారం బీఆర్ఎస్ కు రాజీనామా చేసిన ఆరూరి.. ఆదివారం బీజేపీలో చేరుతున్నట్లు ప్రకటించారు.
మరోవైపు, హైదరాబాద్ నగరంలోని జూబ్లీహిల్స్, నంది నగర్‌లో ఉంటున్న సీఎం కేసీఆర్ తన మకాంను మార్చాలని భావిస్తున్నారు. ఈ ఇల్లు ఏమాత్రం కలిసిరాకపోవడంతో ఆయన మరో ఇంటిలోకి వెళ్లాలని భావిస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో భారాస ఓటమి తర్వాత ఆ పార్టీలో అలజడి చెలరేగింది. కీలక నేతలంతా పార్టీని వీడిపోతున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో తన కుమార్తె కవితను ఈడీ అధికారులు అరెస్టు చేశారు. దీంతో మాజీ సీఎం కేసీఆర్ తన ఇంటిని మార్చేందుకు సిద్ధమవుతున్నారు.