ఈ నేపధ్యంలో అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లోని ప్రధాన కార్యాలయాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు మాజీ మంత్రి టీ హరీశ్‌రావు విలేకరుల సమావేశంలో తెలిపారు. ఇప్పటికే అధికారం కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఈదుతున్న బీఆర్‌ఎస్‌కు కవిత అరెస్ట్ షాకిచ్చింది. బిఆర్‌ఎస్ నాయకురాలు కవితను అరెస్టు చేయడం పార్టీ నాయకులు, కార్యకర్తలను నిరాశలో కూరుకుపోయేట్లు చేసిందని చెబుతున్నారు.
కాగా తను ఎలాంటి విచారణనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు కవిత. అధికారులు అడిగే అన్ని ప్రశ్నలకు సమాధానమిస్తామని చెప్పారు. కానీ మీడియాకు సెలెక్టివ్ లీకులు ఇవ్వడం ద్వారా నాయకుల ఇమేజ్‌లను దెబ్బతీయాలని చూస్తే ప్రజలు దానిని తిప్పికొడతారని కవిత అన్నారు. మరోవైపు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన దగ్గర్నుంచి భారాసకి చెందిన పలువురు నాయకులు ప్రతిరోజూ ఏదోవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సమావేశమవుతున్నారు. ఇటీవలే... తను పార్టీ తలుపులు తీస్తే భారాసలో మిగిలేది నలుగురే అని రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో భారాసకి చెందిన నాయకులు బెంబేలెత్తిపోతున్నారు.