బీసీ రిజర్వేషన్‌లపై తెలంగాణ సర్కారుకు సుప్రీంలో ఊరట

ఠాగూర్

సోమవారం, 6 అక్టోబరు 2025 (14:09 IST)
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్‌ను అపెక్స్ కోర్టు కొట్టివేసింది. ఈ అంశం హైకోర్టులో పెండింగ్‌లో ఉన్నందున విచారణకు స్వీకరించలేమని జస్టిస్‌ విక్రమ్‌నాథ్‌ నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది. 
 
హైకోర్టులో ఇదే అంశంపై రెండు పిటిషన్లు పెండింగ్‌లో ఉన్నాయని రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీనియర్‌ న్యాయవాదులు సిద్ధార్థ దవే, అభిషేక్‌ సింఘ్వీ, ఏడీఎన్‌ రావు సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఆర్టికల్‌ 32 కింద పిటిషన్‌ ఎందుకు ఫైల్‌ చేశారని పిటిషనర్‌ తరఫు న్యాయవాదిని జస్టిస్‌ విక్రమ్‌నాథ్‌ ధర్మాసనం ప్రశ్నించింది. 
 
హైకోర్టు స్టే ఇవ్వనందున సుప్రీంకోర్టుకు వచ్చామని పిటిషనర్‌ పేర్కొన్నారు. హైకోర్టు స్టే ఇవ్వకుంటే సుప్రీంకోర్టుకు వచ్చేస్తారా? అని ధర్మాసనం ప్రశ్నించింది. అనంతరం పిటిషన్‌ను జస్టిస్‌ విక్రమ్‌నాథ్‌, జస్టిస్‌ సందీప్‌ మెహతా ధర్మాసనం కొట్టివేసింది. 
 
సుప్రీంకోర్టులో అనూహ్య ఘటన .. సీజేఐపై న్యాయవాది దాడికి యత్నం 
 
దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. ఓ కేసు విచారణ సమయంలో భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌‌పై దాడి చేసేందుకు ఓ న్యాయవాది యత్నించాడు. ఈ ఊహించని పరిణామంతో అక్కడున్నవారంతా కలవరపాటుకు గురయ్యారు.
 
సుప్రీంకోర్టులో ఓ కేసు విచారణలో భాగంగా వాదనలు జరుగుతుండగా ఓ న్యాయవాది ప్రధాన న్యాయమూర్తిపైకి బూటు విసిరేందుకు యత్నించాడు. దీన్ని గమనించిన భద్రతా సిబ్బంది వెంటనే అతడిని అడ్డుకున్నారు. ఈ ఘటనపై సీజేఐ జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌ స్పందిస్తూ.. ఇలాంటి బెదిరింపులు తనను ప్రభావితం చేయలేవన్నారు. అనంతరం తన విచారణను కొనసాగించారు. ఘటనకు కారణమైన న్యాయవాదిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. 
 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు