తెలంగాణ రాష్ట్రంలో మరోసారి కరోనా కలకలం రేపింది. ఉస్మానియా దవాఖానలో చనిపోయిన ఇద్దరు రోగులకు వారి మరణానంతరం వచ్చిన రిపోర్ట్స్‌లో కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. పలు అనారోగ్య కారణాలతో దవాఖానలో చేరిన హైదరాబాద్‌కు చెందిన ఇద్దరు వ్యక్తులు రెండు రోజుల వ్యవధిలో మరణించారు. మంగళవారం వచ్చిన నివేదికల్లో ఆ ఇద్దరికీ కరోనా పాజిటివ్‌గా తేలింది. అయితే ఉస్మానియా వైద్యులు తొలుత ఒక మరణాన్ని మాత్రమే నిర్ధారించారు.
మంగళవారం రాత్రి రెండో మరణాన్ని కూడా ధ్రువీకరించారు. వీరితోపాటు ఇటీవల ఉస్మానియాలో చేరిన వికారాబాద్ జిల్లా ధరూర్‌కు చెందిన ఎన్ పార్వతమ్మ (61), రాజేంద్రనగర్‌కు చెందిన ఏళ్ల పల్లె లక్ష్మణ్ (36), మల్లేపల్లికి చెందిన ఎండీ హఫ్సా బేగం (12)కు కరోనా పాజిటివ్‌గా తేలింది.
వీరు ప్రస్తుతం దవాఖానలోనే చికిత్స పొందుతున్నారు. యితే, జేఎన్1 వేరియంట్ వైరస్ తేలికపాటిదేనని, ప్రజలు భయపడాల్సిన అవసరంలేదని వైద్యులు చెప్తున్నారు. రాష్ట్రంలో మంగళవారం కొత్తగా ఎనిమిది కొవిడ్ కేసులు నమోదయ్యాయి. నలుగురు కోలుకొని డిశ్చార్జి అయ్యారు. దీంతో ప్రస్తుతం రాష్ట్రంలో 59 యాక్టివ్ కేసులు ఉన్నట్టు వైద్యారోగ్య శాఖ తెలిపింది.