కాక్‌పిట్ వాయిస్ రికార్డర్, బ్లాక్‌బాక్స్ డీకోడ్ చేస్తే తప్ప అహ్మదాబాద్‌లో జరిగిన విమాన ప్రమాదానికి ఖచ్చితమైన కారణాలు చెప్పలేమని తెలంగాణ ఏవియేషన్ అకాడెమీ సీఈవో ఎస్ఎన్ రెడ్డి అన్నారు. ఈ విమాన ప్రమాదంపై ఆయన స్పందిస్తూ, 24-36 గంటల వ్యవధిలో కాక్‌పిట్, బ్లాక్‌బాక్స్‌లను డీకోడ్ చేయొచ్చని తెలిపారు.
ప్రమాదాలకు ప్రధానంగా సాంకేతిక లోపాలు, అనుభవం లేని పైలెట్లు, వాతావరణం బాగోలేకపోవడం వంటివి కనిపిస్తుంటాయన్నారు. కానీ, బోయింగ్ 787 ఎయిర్‌లైనర్ అధునాతనమైనది. అనుభవం కలిగిన పైలెట్లు ఉన్నారు. వాతావరణం బాగానే ఉంది. కారణం ఏమై ఉంటుందో ఖచ్చితంగా చెప్పలేమన్నారు.
25 వేల కంటే ఎక్కువ గంటలు గగనతలంలో శిక్షణ ఇచ్చిన అనుభవం నాది. రెండు ఇంజిన్లు విఫలమయ్యే అవకాశం చాలా అరుదు. ఒకటి, రెండు పక్షులతో ఇబ్బంది ఉండదు. ఒకేసారి వేల సంఖ్యలో పక్షులు వస్తే ఇంజిన్లలోకి వెళితే ఫెయిల్ అవుతాయి. ఇదీ కాదంటే ఇంధన కల్తీతోనే ఇంజిన్లు ఫెయిల్ అయ్యే అవకాశం ఉంది. పైలెట్ నియంత్రణలో లేని విషయం ఏదో జరిగింది.