మహిళా ఎమ్మార్వో కాదు... అనకొండ... రూ.12 కోట్ల అక్రమాస్తులు

ఠాగూర్

గురువారం, 14 మార్చి 2024 (09:01 IST)
తెలంగాణ రాష్ట్రంలో ఓ మహిళా ఎమ్మార్వో అనకొండగా మారిపోయారు. ఆమె ఆదాయానికి మించి అక్రమాస్తులు కూడబెట్టారు. ఈ అక్రమాస్తులు అన్నీఇన్నీవాకు.. ఏకంగా రూ.12 కోట్లకు పైమాటే. ఇవన్నీ ఏసీబీ అధికారుల తనిఖీల్లో వెలుగు చూశాయి. ఆ తాహసీల్దారు పేరు రజిని. తెలంగాణ రాష్ట్రంలోని జమ్మికుంట ఎమ్మార్వో. ఆమె ఇంటిపై ఏసీబీ అధికారులు పంజా విసిరారు. హనుమకొండలోని కేఎన్ఎన్ రెడ్డి కాలనీలో ఉన్న ఆమె నివాసంలో బుధవారం తెల్లవారుజాము నుంచి సోదాలు నిర్వహించారు. మరో ఐదు చోట్ల ఆమె సమీప బంధువుల ఇండ్లలోనూ ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. గతంలో రజిని పనిచేసిన ధర్మసాగర్లోనూ తనిఖీలు చేశారు. 
 
ఈ తనిఖీల్లో ఇంటి స్థలాలు, వ్యవసాయ భూముల డాక్యుమెంట్లు, బంగారు ఆభరణాలు, కొంత నగదు స్వాధీనం చేసుకున్నారు. రూ.25 లక్షల బ్యాంకు బ్యాలెన్స్ గుర్తించి, బ్యాంకు అధికారులకు సమాచారమిచ్చి సీజ్ చేయించారు. రజనీ అక్రమ ఆస్తుల వివరాలను కరీంనగర్ ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి మీడియాకు తెలిపారు.
 
ప్రభుత్వ విలువ రూ.3.12 కోట్లు కాగా, బహిరంగ మార్కెట్లో రూ.12 కోట్లుగా ప్రాథమిక విచారణలో తేలిందని వెల్లడించారు. ఇంకా దర్యాప్తు కొనసాగుతున్నదని తెలిపారు. ఇప్పటివరకు రూ.12 కోట్ల అక్రమ ఆస్తుల్లో రెండు అంతస్థుల భవనం, 21 ప్లాట్లు, ఏడు ఎకరాల వ్యవసాయ భూమి, 25 లక్షల బ్యాంకు బ్యాలెన్స్, కిలోన్నర బంగారు అభరణాలు, రెండు కార్లు, మూడు బైకులు, లక్షన్నర నగదు ఉన్నాయని తెలిపారు. సోదాల అనంతరం రజినిని అరెస్టు చేసి, కరీంనగర్ ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరుపరిచారు. కోర్టు ఆదేశాలతో ఆమెను రిమాండ్కు తరలించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు