మొంథా తుఫాను కారణంగా రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయని, ఈ సీజన్‌లో ఎలాంటి అంటు వ్యాధులు ప్రబలకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మొంథా తుపాను తీవ్ర వాయుగుండంగా మారి భారీ వర్షాలు కురుస్తున్నందున.. రాష్ట్రవ్యాప్తంగా అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.
ధాన్యం, పత్తి కొనుగోలు కేంద్రాల్లోనూ తగిన ఏర్పాట్లు చేయాలని తెలిపారు. ఉమ్మడి ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాల్లో ప్రభావం ఎక్కువగా ఉండటంతో పాటు హైదరాబాద్, ఇతర జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురుస్తున్నందున అన్ని శాఖల అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు.
గోల్కొండ, కోణార్క్ ఎక్స్‌ప్రెస్‌లు నిలిచిపోవడం.. పలు రైళ్లను దారి మళ్లించినందున ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. మొంథా తుపాను ప్రభావం ఎక్కువగా ఉన్న జిల్లాల్లో ఎస్‌డీఆర్‌ఎఫ్, ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలు సమన్వయం చేసుకోవాలని... కలెక్టర్లు ఆయా బృందాలకు దిశా నిర్దేశం చేయాలని సూచించారు.
వర్షం నీరు నిల్వ ఉండి దోమలు, ఇతర క్రిమికీటకాలు విజృంభించి అంటువ్యాధులు ప్రబలే ప్రమాదం ఉన్నందున పారిశుద్ధ్య సిబ్బంది ఎప్పటికప్పుడు పారిశుద్ధ్య పనులు చేపట్టాలని పేర్కొన్నారు. వైద్యారోగ్య శాఖ తగినన్ని మందులు అందుబాటులో ఉంచుకోవాలని... అవసరమైన చోట్ల వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ప్రాణ, ఆస్తి, పశు నష్టం లేకండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.