ఈ-కార్ రేస్ స్కామ్ అరెస్టు నుంచి తప్పించుకునేందుకు కేటీఆర్ ఢిల్లీ టూర్: సీఎం రేవంత్ రెడ్డి

ఠాగూర్

బుధవారం, 13 నవంబరు 2024 (10:52 IST)
తెలంగాణ రాష్ట్రంలో ఈ -కార్‌ రేస్‌ స్కామ్‌ నుంచి తప్పించుకునేందుకే భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ హస్తిన పర్యటనకు వెళ్లారని, గవర్నర్‌ అనుమతి రాగానే కేటీఆర్‌పై చర్యలు ఉంటాయని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, బీజేపీని అంతం చేస్తామన్న కేటీఆర్‌ ఇప్పుడు ఆ పార్టీతో ఎలా కలుస్తారు? మహారాష్ట్రలో కాంగ్రెస్‌కు ఓటు వేయొద్దంటే బీజేపీకి సహకరించినట్టు కాదా? అని నిలదీశారు. అలాగే, తమ కాంగ్రెస్‌ ఫార్మాట్‌ మార్చుకోవాలి.. కాంగ్రెస్‌ నేతలు టెస్ట్‌ మ్యాచ్‌ ఆడుతున్నారనీ, ఇప్పుడు 20-20 ఫార్మాట్‌ నడుస్తోందని, మేం ఆ లెవల్‌లో ఆడాల్సి వుందని ఆయన పేర్కొన్నారు. 
 
ఇకపోతే, ఫార్ములా ఈ-రేసు కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌పై గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ఆమోదం తెలిపిన తర్వాత చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కేసు నుంచి తప్పించుకునేందుకే కేటీఆర్ ఢిల్లీలో పర్యటించారన్నారు. ఇది బీఆర్ఎస్, బీజేపీ మధ్య ఉన్న రహస్య ఒప్పందాన్ని బట్టబయలు చేస్తోందని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.
 
బీఆర్ఎస్ హయాంలో జరిగిన అవినీతి ఇప్పుడు బట్టబయలు అవుతుందని పేర్కొన్నారు. తాము అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా కేటీఆర్ ఎదురుదాడికి దిగుతున్నారని అన్నారు. ఫార్ములా ఈ రేసు నిధుల్లో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై కేటీఆర్‌ను ప్రాసిక్యూట్ చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం గత నెలలో గవర్నర్ అనుమతి కోరిన విషయం తెలిసిందే.
 
ఇక అమృత్ స్కాంలో తనపై కేటీఆర్ చేసిన ఆరోపణలను రేవంత్ రెడ్డి తోసిపుచ్చారు. 'రెడ్డిగా పేరున్న వారందరూ నా బంధువులు కాదు' అని సీఎం పేర్కొన్నారు. కాగా, కేటీఆర్ తన బావ సృజన్ రెడ్డికి చెందిన కంపెనీకి అమృత్ కింద రూ.1,137 కోట్ల టెండర్ కట్టబెట్టారని ఆరోపించారు. ఈ ఆరోపణలపై స్పందిస్తూ ముఖ్యమంత్రి పైవ్యాఖ్యలు చేశారు.
 
అమృత్ టెండర్లపై కేటీఆర్ కోర్టును ఆశ్రయించాలనుకుంటే.. ఆ పని చేసే స్వేచ్ఛ అతనికి ఉందని రేవంత్ రెడ్డి అన్నారు. అవినీతిలో కూరుకుపోయిన బీజేపీని తుదముట్టిస్తామని శపథం చేసిన కేటీఆర్ బీజేపీ నేతలను ఎందుకు కలిశారని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీకి బీఆర్ఎస్ మద్దతిస్తోందని ఆరోపించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు