మెగా డీఎస్సీకి మెలిక పెట్టిన విద్యాశాఖ.. భర్త పేరుపైనే ఈడబ్ల్యూఎస్ ధృవపత్రాలు ఉండాలి...

ఠాగూర్

శుక్రవారం, 12 సెప్టెంబరు 2025 (12:05 IST)
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మెగా డీఎస్సీ ఎంపిక ప్రక్రియలో భాగంగా కీలకమైన సర్టిఫికేట్ల పరిశీలన సాగుతోంది. అయితే, ఇది కొత్త వివాదానికి దారితీసింది. ముఖ్యంగా ఆర్థికంగా వెనుకబడిన వర్గాల (ఈడబ్ల్యూఎస్) కోటాలో ఎంపికైన వివాహిత మహిళా అభ్యర్థులకు విద్యాశాఖ అనూహ్యమైన నిబంధన విధించడంతో వారిలో తీవ్ర ఆందోళన, గందరగోళం నెలకొంది. ఇప్పటివరకు తండ్రి పేరుతో సమర్పించిన ఈడబ్ల్యూఎస్ ధ్రువపత్రాలు చెల్లవని, తాజాగా భర్త పేరుతో, ఆయన ఆదాయాన్ని ప్రామాణికంగా తీసుకుని జారీ చేసిన సర్టిఫికెట్లను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటామని అధికారులు స్పష్టంచేశారు. 
 
డీఎస్సీ దరఖాస్తు సమయంలో మహిళా అభ్యర్థులు వివాహితులా? అవివాహితులా? అనే వివరాలను స్పష్టంగా తీసుకున్నారు. అయితే, వివాహిత మహిళలు తమ విద్యార్హతలు, ఇతర రిజర్వేషన్ పత్రాల మాదిరిగానే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్‌ను కూడా తండ్రి కుటుంబ ఆదాయం ఆధారంగానే సమర్పించారు. దీనిపై కొన్ని జిల్లాల నుంచి ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయి. వివాహం తర్వాత సంపన్న కుటుంబాలలోకి వెళ్లిన కొందరు మహిళలు, తమ పుట్టింటి ఆదాయాన్ని చూపి ఈడబ్ల్యూఎస్ ప్రయోజనాలు పొందుతున్నారంటూ ఆ ఫిర్యాదుల్లో పేర్కొన్నారు. 
 
ఈ నేపథ్యంలో రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ వెంటనే స్పందించింది. వివాహిత మహిళా అభ్యర్థుల ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్లను పునఃపరిశీలించాలని జిల్లా విద్యాశాఖ అధికారులను (డీఈవోలు) ఆదేశించింది. ఈ ఆదేశాలతో అప్రమత్తమైన అధికారులు, ఒక జిల్లాలో ఎంపికైన వివాహిత మహిళా అభ్యర్థులను గుర్తించారు. వీరిలో 35 మంది తండ్రి పేరుతో ఉన్న ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్లు సమర్పించినట్లు తేలింది. వెంటనే స్పందించి, భర్త పేరుతో కొత్త సర్టిఫికెట్లు తేవాలని వారికి సూచించారు. 
 
దీంతో ఎంపిక జాబితాలో ఉన్న ఆ అభ్యర్థులు హుటాహుటిన మండల రెవెన్యూ కార్యాలయాలకు పరుగులు తీసి, కొత్త ధ్రువపత్రాలు సమర్పించారు. గురువారం సాయంత్రం నాటికి ఇద్దరు మినహా మిగిలిన వారందరూ కొత్త సర్టిఫికెట్లను అందించినట్లు సమాచారం. అయితే, సర్టిఫికెట్ల పరిశీలన ప్రక్రియలో తరచూ ఇలాంటి మార్పులు చోటుచేసుకోవడం, కొత్త నిబంధనలు తెరపైకి రావడం అభ్యర్థులను తీవ్ర గందరగోళానికి గురిచేస్తోంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు