ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న మిషన్ కాకతీయ కార్యక్రమానికి ప్రచార కార్యకర్తగా ఎవర్ని నియమించలేదు. వరంగల్ జిల్లాలో మిషన్ కాకతీయ అంబాసిడర్‌గా చెప్పుకొని తిరుగుతున్న అఖిల్ అనే వ్యక్తికి మిషన్ కాకతీయతో ఎలాంటి సంబంధం లేదు. ఇరిగేషన్ శాఖతో కానీ, మంత్రి హరీష్ రావు కార్యాలయంతో కానీ అతనికి ఎలాంటి సంబంధం లేదు. అఖిల్‌ను కానీ, మరొకరిని కానీ మిషన్ కాకతీయ అంబాసిడర్‌గా నియమించలేదు.
అఖిల్ అనే వ్యక్తి 'అంబాసిడర్'గా చెలామణి అవుతూ కాంట్రాక్టర్లు, ఇరిగేషన్ శాఖ ఇంజనీర్లపై ఒత్తిడి తెస్తూ, బెదిరిస్తు... వాహనాలు సమకూర్చుకుంటున్నట్టు, డబ్బులు వసూలు చేస్తున్నట్టు ఫిర్యాదులు వస్తున్నాయి. వరంగల్ జిల్లాలో మిషన్ కాకతీయ కార్యక్రమాలని నిర్వహిస్తున్నానని అందుకు నిధులు సమకూర్చాలని డాక్టర్లను, పాఠశాలలు, కాలేజీల యాజమాన్యాలు, వ్యాపారుల వద్ద నుంచి కూడా నిధులు వసూలు చేస్తున్నట్లు మంత్రి కార్యాలయానికి ఫిర్యాదులు వస్తున్నాయి.
అఖిల్‌తో పాటు మరెవరు 'మిషన్ కాకతీయ' పేరు చెప్పుకొని ఫోన్ చేసినా వెంటనే స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసి పట్టించండి. ఇంజనీర్లు, కాంట్రాక్టర్లు, వరంగల్ జిల్లా ప్రజలు ఇటువంటి దొంగ మనుషుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఇలాంటి మోసగాళ్ల కదలికలు తెలిసిన వెంటనే కేసు పెట్టి అరెస్టు చేయించాలి.