ఇటీవల కాలంలో ఎలక్ట్రిక్ వాహనాలు అగ్ని ప్రమాదాలకు గురవుతుండటం కొత్త కొనుగోలుదారులను ఆందోళనకు గురిచేస్తోంది. తాజాగా, తెలంగాణా రాష్ట్రంలో మరొక ఎలక్ట్రిక్ స్కూటర్ బ్యాటరీ పేలిన ఘటన కలకలం రేపుతోంది. ఈ ప్రమాదంలో ఓ 80 ఏళ్ల వృద్ధుడు మరణించగా మరో ముగ్గురికి గాయాలయ్యాయి.
ఈ ఘటన తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాలో జరిగింది. వివరాల్లోకి వెళితే, తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాలో గురువారం ఓ ఎలక్ట్రిక్ స్కూటర్ బ్యాటరీ పేలడంతో 80 ఏళ్ల వృద్ధుడు మరణించాడు. అతని కుటుంబంలోని మరో నలుగురికి కాలిన గాయాలయ్యాయి.
పోలీసుల ప్రాధమిక సమాచారం ప్రకారం, వారి ఇంటి గదిలో బ్యాటరీని ఛార్జ్ చేస్తున్నప్పుడు ఈ సంఘటన జరిగింది. చనిపోయిన వ్యక్తిని బి రామస్వామిగా గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.