ఆర్టీసీ బస్సు చార్జీలపై ఆందోళన - బండి సంజయ్ హౌస్ అరెస్టు

శుక్రవారం, 10 జూన్ 2022 (13:19 IST)
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ బస్సు ప్రయాణ చార్జీలను భారీగా పెంచేసింది. ఈ నిర్ణయంపై విపక్ష పార్టీలు తీవ్రంగా గగ్గోలు పెడుతూ ఆందోళనకు దిగాయి. బీజేపీ ఆధ్వర్యంలో ఆందోళనకు ఆ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు బండి సంజయ్ పిలుపునిచ్చారు. ఇందులోభాగంగా, జేబీఎస్ వద్ద నిరసన కార్యక్రమానికి బీజేపీ నేతలు సిద్ధమయ్యారు. దీంతో తెలంగాణ బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు బండి సంజయ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఆందోళన జరిగే ప్రాంతానికి వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. 
 
బంజారా హిల్స్‌లోని ఆయన ఇంటి చుట్టూత పోలీసు బలగాలను మొహరించారు. దీంతో ఆయన బయటకు రాలేని పరిస్థితి ఏర్పడింది. ఆర్టీసీ చార్జీల పెంపుతో సామాన్య ప్రజానీకంపై మరింత భారం మోపారని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఆర్టీసీ చార్జీలు పెంచడం మూర్ఖత్వమా? అంటూ ఆయన ప్రశ్నిస్తున్నారు. తెరాస మూడేళ్ల పాలనలో ఇప్పటివరకు ఐదుసార్లు బస్సు చార్జీలను పెంచిందని గుర్తుచేశారు. 
 
పేదలను బస్సులో కూడా ప్రయాణించకుండా చేస్తారా అంటూ ఆయన మండిపడ్డారు. తెరాస ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బస్సు చార్జీలు 60 శాతం మేరకు పెంచారని ఆయన ఆరోపించారు. తెలంగాణ పోలీసులకు రేపిస్టులను అరెస్టు చేయడం చేతకాదు గానీ, బీజేపీ నేతల గృహాలను మాత్రం ముట్టడించడం బాగా తెలుసని బండి సంజయ్ నిప్పులు చెరిగారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు