వనమా రాఘవ అరెస్ట్... సస్పెన్షన్ వేటు టీఆర్ఎస్ పార్టీ

శనివారం, 8 జనవరి 2022 (10:59 IST)
కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు తనయుడైన రాఘవ బెదిరింపుల కారణంగా రామకృష్ణ ఈ నెల 3న తన భార్య, ఇద్దరు పిల్లలపై పెట్రోలు పోసి నిప్పంటించి తానూ ఆత్మహత్య చేసుకున్న ఘటన తెలుగురాష్ట్రాల్లో తీవ్ర కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే.
 
ఈ కేసులో ఏ2గా ఉన్న రాఘవ సంఘటన జరిగిన నాటి నుంచి తప్పించుకుని తిరుగుతున్నాడు. దీంతో పోలీసులు పలు టీమ్‌లుగా ఏర్పడి అతడి కోసం గాలింపు చేపట్టారు. కొద్దిరోజులుగా తొర్రూరు, హైదరాబాద్‌, సూర్యాపేట, చీరాల, విశాఖపట్నం, రాజమండ్రికి ప్రయాణాలు సాగించినట్లు తెలిసింది. ఒక్కోచోట ఒక్కో సిమ్‌కార్డును మార్చుతూ పోలీసులకు పట్టుబడకుండా జాగ్రత్తపడ్డాడు. 
 
విశాఖలో రెండురోజులపాటు తలదాచుకున్న రాఘవ శుక్రవారం అక్కడి నుంచి హైదరాబాద్‌ వెళ్తుండగా పశ్చిమ గోదావరి, భద్రాద్రి జిల్లా సరిహద్దుల్లో మందలపల్లి అడ్డరోడ్డు వద్ద భద్రాద్రి జిల్లా అదనపు ఎస్పీ కేఆర్‌కే ప్రసాద్‌రావ్‌ ఆధ్వర్యంలో అతడిని అదుపులోకి తీసుకుని పాల్వంచ ఏఎస్పీ కార్యాలయానికి తరలించారు. 
 
అతడితో పాటు పాల్వంచ మండలానికి చెందిన ముక్తేవి గిరీశ్‌, మరొకరిని పోలీసులకు అదుపులోకి తీసుకున్నారు. అర్ధరాత్రి 12 గంటల సమయంలో వారిని పాల్వంచ తీసుకొచ్చి విచారించినట్లు ఎస్పీ సునీల్‌దత్‌ పేర్కొన్నారు. ఇంకా వనమా రాఘవను టీఆర్ఎస్ పార్టీ సస్పెండ్ చేసింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు