సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ముగ్గురు యువకులు ఓ బైక్‌పై వెళుతున్నారు. వాళ్లు చేసిన విన్యాసం ఏంటో తెలుసా? మధ్యలో కూర్చున్న వ్యక్తి తన రెండు చేతులను డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తిని చుట్టేసి మొబైల్ ఫోన్ పట్టుకున్నాడు. డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తి ఆ ఫోన్‌లో చూస్తున్నాడు. పైగా వాళ్లకి మాస్కులు ఉన్నా సరిగ్గా పెట్టుకోలేదు. హెల్మెట్ కూడా లేదు. దీంతో అక్కడే ఉన్న ఓ ట్రాఫిక్ పోలీసు సదరు యువకుల విన్యాసాన్ని ఫోటో తీసేశారు.
ఇక ఈ ఫొటోను ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన సైబరాబాద్ పోలీసులు.. రోడ్డుపై టైటానిక్ విన్యాసాలు.. పట్టుతప్పితే మునిగిపోతాయి ప్రాణాలు అంటూ క్యాప్షన్ ఇచ్చారు. ఇక ఈ యువకులు చేసిన ఈ తప్పునకు విలువ ఎంత పడిందో తెలుసా? ఏకంగా రూ.3600. ఈ ముగ్గురు ఈ ఒకే విన్యాసంతో ఏకకాలంలో ఆరు ట్రాఫిక్ రూల్స్‌ను ఉల్లంఘించారు.
బైక్ వెనకాల కూర్చున్న వ్యక్తి హెల్మెట్ ధరించని కారణంగా రూ.100, సెల్‌ఫోన్ డ్రైవింగ్‌కు రూ.1,000, బహిరంగ ప్రదేశాల్లో మాస్కు సరిగ్గా ధరించనందుకు రూ.1000, డ్రైవర్ హెల్మెట్ ధరించని కారణంగా రూ.200, వెనుక చూసేందుకు సైడ్ మిర్రర్స్ లేని కారణంగా మరో రూ.100, ట్రిపుల్ రైడింగ్‌కు రూ.1200 ఇలా మొత్తం జరిమానా విలువ రూ.3,600కు చేరింది. ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.