జలవిద్యుత్‌ కేంద్రం ముప్పుపై ముందే హెచ్చరిక.. అయినా పట్టించుకోని అధికార గణం

శనివారం, 22 ఆగస్టు 2020 (12:03 IST)
శ్రీశైలం ఎడమగట్టు జలవిద్యుత్‌ కేంద్రంలో అడుగడుగునా నిర్వహణ లోపం, ఉన్నతాధికారుల నిర్లక్ష్యమే ఇంతటి ఘోర ప్రమాదానికి కారణమైందని తెలుస్తోంది.

పవర్‌ హౌజ్‌లో షార్ట్‌ సర్క్యూట్‌ ప్రమాదాన్ని అక్కడి సిబ్బంది రెండు రోజుల క్రితమే గుర్తించి ఉన్నతాధికారులకు సమాచారమిచ్చినట్లు తెలుస్తోంది. నిపుణులను పంపి ఆ సమస్యను పరిష్కరిస్తామని చెప్పిన అధికారులు.. ఆ తర్వాత దాని గురించి పట్టించుకోలేదు. 
 
పవర్‌హౌజ్‌లో ఎప్పటికప్పుడు గాలి బయటకు వెళ్లేలా ఎగ్జాస్ట్‌ ఫ్యాన్లు ఉండాలి. యూనిట్లలో ఉష్ణోగ్రత సమతౌల్యంగా ఉండేలా ఏసీల నిర్వహణ చేపట్టాలి. అత్యవసరమైనప్పుడు పవర్‌స్టేషన్‌ నుంచి సిబ్బంది తప్పించుకునేందుకు వీలుగా ఎస్కేప్‌ వేలు, అవసరమైన వాహనాలు అందుబాటులో ఉండాలి.

అవసరమైనప్పుడు వినియోగించేందుకు వీలుగా ఆక్సిజన్‌ సిలిండర్లు అందుబాటులో ఉండాలి. పక్కాగా అగ్నిమాపక వ్యవస్థను ఏర్పాటు చేయాలి. కానీ ఈ నిబంధనలేవీ పాటించినట్లు లేదని నిపుణులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

ప్రమాదం జరిగినప్పుడు పవర్‌హౌజ్‌లో ఉండే సిబ్బందిని తరలించేందుకు ఏడు ఎమర్జెన్సీ వాహనాలు ఉండాల్సి ఉండగా, ప్రమాద సమయంలో ఒక్క వాహనమే ఉంది.

మంటలు ఆర్పేందుకు ఆక్సిజన్‌ సిలిండర్లు ప్రతి యూనిట్‌లో అందుబాటులో ఉండాలి. కానీ అవి సినిమాహాళ్లలో మాదిరిగా చిన్నవిగా ఉన్నాయని సమాచారం. వ్యాపించిన పొగ ఎప్పటికప్పుడు బయటకు వెళ్లిపోయేలా చేయాల్సిన ఎగ్జాస్ట్‌ ఫ్యాన్లు పనిచేయలేదు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు