విదేశీ చాక్లెట్ ఒకటి ఓ బాలుడి ప్రాణం తీసింది. విదేశాలకు వెళ్లి వచ్చిన ఓ తండ్రి.. తన కుమారుడి కోసం ప్రేమతో తెచ్చిన ఓ చాక్లెట్.. చివరకు అతని ప్రాణాలు తీయడంతో ఆ తల్లిదండ్రుల ఆర్తనాదాలు మిన్నంటుతున్నాయి. ఈ విషాదకర ఘటన తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ జిల్లాలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన కంగర్ సింగ్ బతుకుదెరువు కోసం వరంగల్ వచ్చి డాల్ఫిన్ గల్లీలో స్థిరపడ్డాడు. ఈయన స్థానికంగా ఓ ఎలక్ట్రానిక్ షాపును నిర్వహిస్తూ తన కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఈయనకు భార్య, ముగ్గురు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు. వీరిలో ముగ్గురు చిన్నారు. శారద పబ్లిక్ పాఠశాలలో విద్యాభ్యాసం చేస్తున్నారు.
ఈ క్రమంలో కంగర్ సింగ్ ఇటీవల ఆస్ట్రేలియాకు వెళ్లి చ్చాడు. శనివారం పిల్లలు స్కూలుకు వెళ్లే క్రమంలో విదేశాల నుంచి తండ్రి తీసుకొచ్చిన చాక్లెట్లను వారికి తల్లి ఇచ్చింది. అయితే, రెండో తరగతి చదువుతున్న కుమారుడు సందీప్ (8) స్కూలుకు వెళ్లి చాక్లెట్ నోట్లో వేసుకున్నాడు. అది తిన్నగా వెళ్లి గొంతులో ఇరుక్కుని పోయింది. దీంతో ఊపిరి ఆడకపోవడంతో కిందపడిపోయాడు.
దీన్ని గమనించిన క్లాస్ టీచర్, పాఠశాల సిబ్బంది తల్లిదండ్రులకు సమాచారం చేరవేసి ఎంజీఎం ఆస్పత్రికి తరలించాడు. అయితే, గొంతులో చాక్లెట్ ఇరుక్కుని ఉండటాన్ని గుర్తించిన వైద్యులు.. చికిత్స అందిస్తుండగానే ప్రాణాలు విడిచాడు. బాలుడి మృతితో కంగర్ సింగ్ కుటుంబం శోకసముద్రంలో మునిగిపోయింది.