నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్‌ను ఆ నియోజకవర్గానికి చెందిన రైతులు ఓ ఆట ఆడుకున్నారు. గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో ఒక్కటంటే ఒక్కటి కూడా అమలు చేయలేదని నిలదీశారు. పైగా, పసుపు బోర్డు కంటే ప్రాంతీయ కార్యాలయం ముఖ్యమని ఎంపీ అరవింద్ చేసిన వ్యాఖ్యలను రైతులు తప్పుబట్టారు.
అంతేకాదు, ఎన్నికల సమయంలో అరవింద్ హామీలు ఇచ్చిన వీడియోలను కూడా రైతులు ఈ సందర్భంగా చూపించారు. నిజామాబాద్‌లో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని మాట తప్పారంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీ అరవింద్ ప్రసంగానికి రైతులు అడ్డుతగిలారు.
అంతకుముందు, బాల్కొండ పసుపు రైతులు కూడా అరవింద్‌పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పసుపు బోర్డు కంటే ప్రాంతీయ కార్యాలయం ఉపయోగకరమైనదని అరవింద్ చెబుతున్నారని, ఇప్పుడాయన రాజీనామా చేసి అదే మాటతో ఎన్నికలకు వెళ్లి గెలవాలని రైతులు స్పష్టం చేశారు.