'బుల్లెట్ వీరుడు'కి అశ్రునివాళి - అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు...

గురువారం, 22 అక్టోబరు 2020 (12:16 IST)
తెలంగాణ రాష్ట్ర తొలి హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి బుధవారం అర్థరాత్రి మృతి చెందారు. గత కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ వచ్చిన ఆయన.. తుదిశ్వాస విడిచారు. ఈయన బుల్లెట్ వీరుడుగా పేరుగడించిన నాయన... తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తర్వాత తొలి హోం మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. మంత్రి అయిన తర్వాత ఆయనకు కేసీఆర్‌ ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. ఆ పదవి లాటరీ పద్ధతిన ఆరు సంవత్సరాలకు రావడంతో పూర్తి కాలం ఎమ్మెల్సీగా కొనసాగారు. 
 
అదేసమయంలో నాయిని నర్సింహా రెడ్డికి బుల్లెట్‌ వీరుడిగా పేరుంది. ఆయన 1978 నుంచి చాలా సంవత్సరాలు బుల్లెట్‌పైనే తిరిగారు. ఎమ్మెల్యే అయ్యాక కూడా బుల్లెట్‌పైనే అన్ని కార్యక్రమాలకూ హాజరయ్యేవారు. బుల్లెట్‌ వీరుడుగా పేరొందారు. అనంతరం మహేంద్ర జీప్‌ వాడకంతో జీప్‌ వీరుడిగా కూడా పిలిచేవారు. ఆ బుల్లెట్‌, జీపు నేటికీ ఆయన వద్దే ఉన్నాయి. వాటిని అపురూపంగా చూసుకునేవారు. ఆయనే స్వయంగా కడిగి షెడ్డులో పెట్టేవారు. 
 
అంతేకాకుండా, ఎమర్జెన్సీ సమయంలో నాయని నర్సింహా రెడ్డి జైలు జీవితాన్ని గడిపారు. 1975లో అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ ఎమర్జెన్సీని ప్రవేశపెట్టారు. దీనికి వ్యతిరేకంగా జరిగిన ఉద్యమంలో పాల్గొన్న నాయిని 18 నెలల పాటు జైలు శిక్షను అనుభవించారు.
 
1977లో జరిగిన లోక్‌సభ ఉప ఎన్నికల సమయంలో సోషలిస్టు పార్టీ జనసంఘ్‌, ఓల్డ్‌ కాంగ్రెస్‌తో కలిసి జనతా పార్టీగా ఆవిర్భవించినప్పుడు నాయిని ఇందులో చేరిచురుకైన పాత్రను పోషించారు. 
 
సుదీర్ఘకాలం రాజకీయాల్లో కొనసాగిన హెచ్‌ఎంఎస్‌లో సామాన్య కార్యకర్తగా పని చేశారు. ఆ తర్వాత ఆయన అంచెలంచెలుగా హెచ్‌ఎంఎస్‌ రాష్ట్ర అధ్యక్ష స్థాయికి ఎదిగారు. అక్కడ నుంచి 1978లో జనతాపార్టీలో చేరి రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. 
 
అటు కార్మిక రంగంలోనూ, ఇటు రాజకీయ రంగంలోనూ నాయిని నర్సింహారెడ్డి  రాణించి రాష్ట్రంలో తనదైనముద్ర వేసుకున్నారు. బుధవారం అర్థరాత్రి ఆయన మృతి చెందిన విషయం తెలిసి కార్మికులు, అభిమానులు విషాదంలో మునిగిపోయారు. 
 
నేతల సంతాపం.. నివాళులు... 
కాగా, మాజీ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి మరణం పట్ల పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. తెలంగాణ సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమంలో, ప్రభుత్వంలో కలిసి పని చేసిన అనుబంధాన్ని సీఎం గుర్తు చేసుకున్నారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. నాయిని నర్సింహారెడ్డి అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని సీఎస్ సోమేశ్ కుమార్‌ను సీఎం ఆదేశించారు.
 
నాయిని మృతి పట్ల తెలంగాణ మంత్రి కేటీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమం, రైల్వే కోర్టు చుట్టూ తిరగడం, ఎన్నికల ప్రచారం, మంత్రులుగా ఆయనతో కలిసి పని చేసిన రోజులను గుర్తు చేసుకుంటూ ఇందుకు సంబంధించిన ఫొటోలను పోస్ట్ చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు. 
 
అలాగే, నాయిని మృతి పట్ల టీడీపీ నేత నారా లోకేశ్ విచారం వ్యక్తం చేశారు. 'ప్రజల కోసం, కార్మికుల కోసం ఎన్నో ఉద్యమాలలో పాల్గొని యువనాయకుల్లో స్ఫూర్తిని నింపిన మాజీ మంత్రి, సీనియర్ నేత నాయిని నర్సింహారెడ్డి మరణం విచారకరం. ఒక నిబద్ధత కలిగిన నాయకుడిని తెలుగువారు కోల్పోయారు. నర్సింహారెడ్డి కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను' అంటూ ట్వీట్ చేశారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు