కొత్త సంవత్సరం నుంచి హైదరాబాదులో ప్రకటనలు, హోర్డింగ్‌లు, కటౌట్లుండవ్

గురువారం, 22 డిశెంబరు 2016 (09:29 IST)
కొత్త సంవత్సరం నుంచి హైదరాబాదు నగరంలో అనుమతి లేకుండా ఇష్టానుసారం ఏర్పాటు చేసే ఫ్లెక్సీలు, గోడలపై రాతలు, హోర్డింగులు, కటౌట్లను నిషేధిస్తున్నట్లు జీహెచ్‌ఎంసీ ప్రకటించింది. నిబంధనను ఉల్లంఘించిన వారిపై కేసు నమోదు లేదా జరిమానా విధిస్తామని కమిషనర్‌ జనార్ధన్ రెడ్డి పేర్కొన్నారు. ఇప్పటికే చెత్త వేస్తే జరిమానా విధిస్తున్నట్లు జీహెచ్ఎంసీ ప్రకటించిన నేపథ్యంలో, తాజాగా ప్రకటనలపై నిషేధం అంశంపై అఖిలపక్ష సమావేశం నిర్వహించగా తెదేపా, సీపీఎం పార్టీలు ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించాయి.
 
అయినప్పటికీ నగర సుందరీకరణలో భాగంగా జనవరి 1వ తేదీ నుంచి అమలు చేయడానికే అధికారులు మొగ్గు చూపారు. ఇప్పటికే సర్కిళ్ల స్థాయిలో అధికారులకు, స్థానిక నేతలకు అవగాహన కల్పించామని కమిషనర్‌ తెలిపారు. ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు మరిన్ని అవగాహన కార్యక్రమాలు చేపడతామన్నారు. మేయర్‌ బొంతు రామ్మోహన్‌ మాట్లాడుతూ.. అన్ని రాజకీయ పార్టీలు జీహెచ్‌ఎంసీ తీసుకున్న నిర్ణయానికి మద్దతు తెలపాలని కోరారు.  

వెబ్దునియా పై చదవండి