కరోనా వైరస్ విజృంభణ నేపథ్యంలో హైదరాబాద్ నగరంలో మళ్లీ లాక్డౌన్ విధించబోతున్నారనే వార్తతో నగర ప్రాంత వాసులు అనేక మంది తమతమ సొంతూళ్ళకు క్యూకట్టారు. దీంతో హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై మంగళవారం వాహనాల రద్దీ నెలకొంది. కార్లు, బస్సులు, ఆటోలు, ద్విచక్రవాహనాల్లో కుటుంబ సభ్యులతో కలిసి స్వస్థలాలకు పయనమయ్యారు.
ట్రాఫిక్ నిలిచిపోవడంతో జీఎంఆర్ సిబ్బంది నాన్‌ఫాస్టాగ్ వాహనాలను ఫాస్టాగ్ కౌంటర్ల ద్వారా మళ్లించి, ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. 16 గేట్లకు గాను 10 గేట్ల ద్వారా విజయవాడ వైపు వెళ్లే వాహనాలను పంపించారు.
హైదరాబాద్‌లో లాక్‌డౌన్ విధిస్తే ఎలాంటి పనులకు వెళ్లలేని పరిస్థితి నెలకొంటుంది. నగరంలో కట్టడి మధ్య ఉండటం కన్నా సొంతూళ్లకు వెళితే అక్కడ వ్యవసాయ పనులు చేసుకోవచ్చు. దీంతోపాటు ఇతర ఉపాధి దొరికే అవకాశం ఉంది. దీనికితోడు కరోనా భయం గ్రామాల్లో చాలా తక్కువగా ఉండటంతో చాలా మంది స్వస్థలాలకు వెళ్లేందుకు అమితాసక్తిని చూపుతున్నారు. దీంతో నగర వాసులంతా తమతమ సొంతూళ్ళకు బయలుదేరారు.