ప్రభుత్వ జీవో పట్టించుకోకుండా నిలువు దోపిడినా? హైకోర్టు ఆగ్రహం
బుధవారం, 8 జులై 2020 (08:08 IST)
కరోనా రోగుల వైద్యం పేరుతో ప్రైవేటు ఆస్పత్రులు నిలువు దోపిడీ చేయడం పట్ల తెలంగాణ రాష్ట్ర హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వం జీవోలు పట్టించుకోని ప్రైవేటు ఆస్పత్రులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది.
నిజానికి హైదరాబాదులోని కొన్ని ప్రముఖ ప్రైవేట్ ఆసుపత్రులకు కరోనా టెస్టింగ్, చికిత్సకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతినిచ్చింది. అయితే, పేషెంట్ల నుంచి భారీ దోపిడికి ప్రైవేట్ ఆసుపత్రులు పాల్పడుతున్నాయని తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.
ఈ పిటిషన్ విచారించిన హైకోర్టు... నగరంలోని కేర్, యశోద, సన్‌షైన్, మెడికవర్ ఆసుపత్రులకు నోటీసులను జారీ చేసింది. ఎంత చార్జీలను వసూలు చేయాలో ప్రభుత్వం జీవో ఇచ్చినప్పటికీ... ఆసుపత్రులు పట్టించుకోకపోవడం దారుణమని హైకోర్టు వ్యాఖ్యానించింది.
నిబంధనలను ఉల్లంఘించే ఆసుపత్రులపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని భావిస్తున్నట్టు తెలిపింది. ఈ విషయంపై 14వ తేదీ లోపల వివరణ ఇవ్వాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.
కాగా, ఇంటీవల హైదరాబాద్ నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రి ఓ మహిళా వైద్యురాలికి కరోనా చికిత్స చేసినందుకు కేవలం 24 గంటలకు 1.25 లక్షల బిల్లు వేసింది. ఈ వ్యవహారంపై ఆమె సెల్ఫీ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ప్రైవేటు ఆస్పత్రుల బండారం వెలుగులోకి వచ్చింది. ఈ క్రమంలోనే తెలంగాణ హైకోర్టు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
గవర్నరుతో సీఎం భేటీ
తెలంగాణ గవర్నరు తమిళిసై సౌందరరాజన్‌తో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి శాంతకుమారి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో కరోనా పరిస్థితి, ప్రభుత్వం చేపట్టిన చర్యలు, ప్రైవేటు ఆసుపత్రుల దోపిడీ, జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధిక కేసుల నమోదు తదితర అంశాలపై చర్చించారు. గవర్నరు అడిగిన పలు ప్రశ్నలకు వారు వివరణ ఇచ్చారు.
వాస్తవానికి ఈ సమీక్షా సమావేశం నిన్ననే జరగాల్సి ఉంది. రాజ్ భవన్‌కు రావాల్సిందిగా వీరికి గవర్నర్ కార్యాలయం నుంచి సమాచారం వెళ్లింది. అయితే సీఎంతో భేటీ కావాల్సిన నేపథ్యంలో, వారు గవర్నరుతో సమావేశాన్ని వాయిదా వేసుకున్నారు. అయితే, గవర్నరుతో సమావేశానికి వీరిద్దరూ రాకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో ఈ సాయంత్రం గవర్నరుతో ఇద్దరూ భేటీ అయ్యారు.