భర్త ఆత్మహత్య యత్నం, భార్య 100 నెంబరుకి కాల్, ఏమైంది?
గురువారం, 5 డిశెంబరు 2019 (21:32 IST)
సికింద్రాబాదులో కుటుంబ కలహాలతో ఉరి వేసుకోబోయిన ఓ వ్యక్తిని చిలకలగూడ పోలీసులు చాకచక్యంగా కాపాడారు. తలుపులు మూసేసి ఉరి వేసుకుంటున్న భర్తను చూసి భార్య మహమ్మద్ బేగం పోలీసులకు 100కు కాల్ చేసింది.
మూడు నిమిషాల్లోనే ఘటనా స్థలికి చేరుకుని ఉరి వేసుకోబోతున్న వ్యక్తిని చిలకలగూడ పోలీసులు రక్షించారు. తలుపులు పగలగొట్టి అతడిని కానిస్టేబుల్ కిరణ్, డ్రైవర్ బాలాజీలు కాపాడారు. ప్రస్తుతం అతని పరిస్థితి బాగానే ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.
100కు డయల్ చేస్తే తాము క్షణాల్లోనే స్పందిస్తామని పోలీసులు మరోసారి నిరూపించుకున్నారు. హుటాహుటిన స్పందించి అతని రక్షించినందుకు చిలకలగూడ పోలీసు ఇన్స్పెక్టర్ సిబ్బందిని అభినందించారు.