ఎమ్మెల్యే భాషను చూసి నవ్వుకుంటున్న ప్రజలు... ప్రచారానికి వద్దంటూ గోల

ఆదివారం, 18 నవంబరు 2018 (16:24 IST)
సినీ నటుడు నందమూరి బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. హిందూపురం అసెంబ్లీ స్థానం నుంచి ఆయన తెలుగుదేశం ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహిస్తున్నారు. దశాబ్దాలుగా సినీ ఇండస్ట్రీలో ఉంటున్నారు. గత నాలుగున్నరేళ్లుగా ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. కానీ, ఆయన భాషపై మాత్రం పట్టుసాధించలేకపోతున్నారు. ఫలితంగా నవ్వులపాలవుతున్నారు. 
 
గతంలో ఓ సినిమా ఫంక్షన్‌లో మాట్లాడుతూ, అమ్మాయిల వెంటపడే పాత్రలు ఈ వయసులో చేయడం కుదరదు. వెళ్లి ముద్దన్నా పెట్టాలి.. కడుపైనా చేయాలంటూ వ్యాఖ్యానించి ప్రతి ఒక్కరి నుంచి విమర్శలపాలయ్యారు. తాజాగా మరోమారు ఆయన అభాసుపాలయ్యారు. 
 
శనివారం ఆయన సోదరుడు నందమూరి హరికృష్ణ హఠాన్మరణంపై వ్యాఖ్యానించారు. అన్న మరణం సంబర ఆశ్చర్యాల్లో ముంచెత్తిందంటూ తడబడ్డారు. ఒక ఎమ్మెల్యేగా ఉంటూ అలా మాట్లాడటం చూసి జనాలు నవ్వుకుంటున్నారు. 
 
బాలయ్య వ్యాఖ్యలపై పలువురు నెటిజన్స్ పలు విధాలుగా స్పందించారు. ఆయన వ్యవహారశైలి, హావభావాలు, మాటలు చూస్తే ఇక ప్రత్యక్షంగా జబర్దస్త్ ప్రోగ్రాం అక్కర్లేదని వేణుగోపాల్ కాసర అనే నెటిజన్ కామెంట్ పోస్ట్ చేశాడు. పాపం ఏం చేస్తారు.. సీల్డ్ కవర్ డైలాగ్స్ చదివారంటూ మరో నెటిజన్ కామెంట్ చేశాడు. హరికృష్ణ మరణం సంబర.. ఆశ్చర్యాలకు గురిచేసిందా అంటూ మరో నెటిజన్ సూటిగా ప్రశ్నించాడు. 
 
కూకట్ పల్లి నుంచి సుహాసిని ఎందుకు పోటీకి నిలబెడుతున్నారనే ప్రశ్నకు బాలయ్య సూటిగా సమాధానం చెప్పలేక పోయారు.. ఊ..ఊ..ఊ.. పార్టీ.. ఒక ఊ..ఊ..ఊ.. అధిష్టానం నిర్ణయం అంటూ సమాధానం దాటవేశారు. సుహాసిని బరిలో నిలుపడం ఒక మహిళా సాధికారిత (ఉమెన్ ఎంపవర్‌మెంట్)కు నిదర్శమని చెప్పాల్సిందిపోయి.. డిక్షనరీలోని ఎంపావర్‌నెస్ అంటూ బాలయ్య సమాధానం చెప్పడం ప్రతి ఒక్కరూ ఫక్కున నవ్వారు. 
 
పైగా, సుహాసిని బరిలోకి నిలపడమే హరికృష్ణకు ఘనమైన నివాళి అని బాలకృష్ణ వ్యాఖ్యానించడం గమనార్హం. ఇలా తలాతోక లేకుండా మాట్లాడుతున్న బాలయ్యను తమతమ స్థానాల్లో ప్రచారానికి రావొద్దంటూ మహాకూటమి నేతలు కోరుతున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు