తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తన ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన వారిపై చర్యలు తీసుకోవడంతో పాటు వారికి పెనాల్టీ విధించాలని అధికారులకు ఆదేశాలు జారీచేశారు. ఆయన శనివారం వరంగల్ జిల్లాలో పర్యటించనున్నారు. గీసుకొండ-సంగెం మండలాల పరిధిలో ఏర్పాటు చేయనున్న కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్ శంకుస్థాపన కార్యక్రమానికి ఈ నెల 20న సీఎం కేసీఆర్ వెళ్లనున్నారు.
దీనికి సంబంధించి కేటీఆర్ పార్క్ స్థలంతో పాటు సీఎం ప్రసంగించే బహిరంగ సభ స్థాలాన్ని పరిశీలించడానికి శనివారం వరంగల్‌కు రానున్నారు. కేటీఆర్ వస్తుడటంతో ఆయన అభిమానులు అడుగడుగునా స్వాగతం పలుకుతూ ఫ్లెక్సీలు కట్టారు. ఇది గమనించిన వికాస్ డానియల్ అనే నెటిజన్ ట్విట్టర్‌లో కేటీఆర్‌కు ఓ ట్వీట్ చేశాడు. అధికార పార్టీ నాయకులకి ఫ్లెక్సీల బ్యాన్ వర్తించదా? అంటూ ట్వీట్ చేశాడు.
ఈ ట్వీట్‌కు కేటీఆర్ స్పందించారు. ఆ ఫ్లెక్సీలను వెంటనే తొలగించాలని వరంగల్ మున్సిపల్ కమిషనర్‌కు సూచించారు. అంతేకాకుండా ఫ్లెక్సీలు కట్టింది తన అభిమానులే అని తెలిసినా వారికి పెనాల్టీ విధించాలని అధికారులను ఆదేశించారు. పార్టీలకు అతీతంగా కేటీఆర్ తీసుకున్న నిర్ణయానికి నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.