పక్కా కాంగ్రెస్ వాది ... అయినా అందరివాడు 'భారతరత్న' ప్రణబ్ మఖర్జీ
సోమవారం, 31 ఆగస్టు 2020 (18:42 IST)
భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ.. పక్కా కాంగ్రెస్ వాది. ఆ పార్టీలో ట్రబుల్ షూటర్. ఎన్నో సంక్షోభాలకు అవలీలగా పరిష్కారం చూపిన మహా మేధావి. అయితే, భారత రాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత, ఆ బాధ్యతల నుంచి తప్పుకున్న తర్వాత అందరివాడుగా మిగిలిపోయాడు.
ముఖ్యంగా, రాష్ట్రపతిగా బాధ్యతలు ముగిశాక రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ నాగ్‌పూర్‌లో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్‌తో కలిసి వేదికను పంచుకున్నారు. దీనిపై కాంగ్రెస్ పార్టీ నేతలు ఎంత రచ్చ చేసినా ప్రణబ్ వెనక్కు తగ్గలేదు.
ఈ కార్యక్రమంలో పాల్గొని తాను నిఖార్సైన రాజకీయవేత్తనని నిరూపించుకున్నారు. రాష్ట్రపతి అయినప్పటినుంచీ తాను అన్ని పార్టీలకు చెందినవాడినని చెప్పకనే చెప్పారు. రాష్ట్రపతి బాధ్యతలు ముగిశాక కూడా ఆయన అదే తరహాలో వ్యవహరించారు.
భరత మాతకు ఓ ఋషి... రాంనాథ్ కోవింద్
మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ దివంగతులు కావడం పట్ల రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ప్రణబ్ ముఖర్జీని ఓ రుషితో పోల్చారు. ప్రణబ్ ముఖర్జీ ఇక లేరనే వార్త విని తాను చాలా శోకసంతప్తుడినయ్యానని పేర్కొన్నారు. ఆయన కన్నుమూయడంతో ఓ శకం ముగిసిందని పేర్కొన్నారు.
ప్రజా జీవితంలో మహోన్నత నేత అని, ఆయన భరత మాతకు ఓ రుషి మాదిరిగా సేవ చేశారని కొనియాడారు. అత్యంత విలువైన బిడ్డల్లో ఒకరిని కోల్పోయినందుకు దేశం శోకిస్తోందని పేర్కొన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు, స్నేహితులకు, ప్రజలందరికీ సంతాపం తెలిపారు.
సుప్రసిద్ధ రాజకీయ నేత .. మాయావతి
మాజీ రాష్ట్రపతి, కాంగ్రెస్ సీనియర్ నేత ప్రణబ్ ముఖర్జీ మరణంపై బహుజన్ సమాజ్ పార్టీ అధ్యక్షురాలు మాయావతి విచారం వ్యక్తం చేశారు. సుధీర్ఘమైన రాజకీయ జీవితంలో ప్రణబ్ ముఖర్జీ సేవా-అంకితభావం గొప్పవని ఆమె ప్రశంసించారు. ఆయన నాగరిక స్వభావం దేశంలో ఎప్పటికీ నిలిచిపోతుందని అన్నారు. ప్రణబ్ ముఖర్జీ మరణించిన కొద్ది నిమిషాలకే తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా మాయావతి సంతాపం వ్యక్తం చేశారు.
'దేశంలోని ప్రసిద్ధ రాజకీయ ప్రముఖులలో మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఒకరు. ఆయన ఈరోజు చికిత్స పొందుతూ మరణించడం విచారకరం. ప్రణబ్ కుటుంబం తీవ్ర దు:ఖంలో మునిగిపోయి ఉంటుంది. వారికి నా సంతాపం వ్యక్తం చేస్తున్నాను. ప్రణబ్ సుధీర్ఘమైన రాజకీయ జీవితం, సేవా అకింతభావాలు, సున్నితమైన-నాగరిక స్వభావం ఈ దేశం ఎప్పటికీ గుర్తుంచుకుంటుంది' అని మాయావతి ట్వీట్ చేశారు.
కాగా, 84 యేళ్ల ప్రణబ్ ముఖర్జీ సోమవారం సాయంత్రం కన్నుమూశారు. నెలవారీ వైద్య పరీక్షలకోసం ఆస్పత్రి వెళ్లిన ఆయనకు మెదడుకు రక్త ప్రసరణ చేసే నాళంలో గడ్డకట్టినట్టు వైద్యులు గుర్తించి ఆపరేషన్ చేశారు. ఆ తర్వాత దానికి ఆపరేషన్ చేశారు. ఈ క్రమంలోనే ఆయనకు కరోనా వైరస్ సోకింది. ఆ తర్వాత ఆయన డీప్ కోమాలోకి వెళ్లిపోయి, సోమవారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు.