ఈ యేడాది ఆఖరులో తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరుగనున్నాయి. దీంతో ఆ రాష్ట్రంలో ఒక్కసారిగా రాజకీయాలు వేడెక్కాయి. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు తమకు అవకాశం రాదని భావించిన నేతలు ఇతర పార్టీల్లో చేరిపోయేందుకు అమితాసక్తిని చూపుతున్నారు. ఇప్పటికే తెరాసకు చెందిన ఒకరిద్దరు సీనియర్ నేతలు కాంగ్రెస్ గూటికి చేరుకున్నారు. మరికొందరు సిద్ధంగా ఉన్నారు. అలాగే, అధికార భారత రాష్ట్ర సమితికి చెందిన నేతలు కూడా పక్క చూపులు చూస్తున్నారు. మరికొందరు బహిరంగంగానే వార్నింగులు ఇస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో తమకు టిక్కెట్ ఇవ్వకుంటా కారు దిగిపోతానంటూ సెలవిస్తున్నారు. ఇలాంటి వారిలో తీగల కృష్ణారెడ్డి ఒకరు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం ఎమ్మెల్యే.
ఈయన భారాస అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు. వచ్చే ఎన్నికల్లో తనకు మహేశ్వరం టికెట్ ఇవ్వకుంటే కారు దిగడం ఖాయమని స్పష్టంచేశారు. 'కాంగ్రెస్ నుంచి గెలిచిన సబితారెడ్డిని పార్టీలోకి తీసుకొని సీఎం కేసీఆర్ తప్పుచేశారు. మా కోడలు డా.అనితారెడ్డి రంగారెడ్డి జడ్పీ ఛైర్‌పర్సన్‌గా ఉండడంతో ఒకే ఇంట్లో రెండు పదవులు కావాలా అని అంటున్నారు.
మేం కూడా విమర్శిస్తే బాగుండదు. నేను కేసీఆర్‌తో సమానంగా రాజకీయాల్లో ఉన్నా. ఉద్యమంలో పనిచేసిన సీనియర్ నాయకులు చాలామంది పార్టీని వీడుతున్నారు. వారందర్నీ పిలిపించి మాట్లాడాలి. లేకుంటే మా దారి మేం చూసుకుంటాం. కాంగ్రెస్ నుంచి నన్ను ఇప్పటివరకు ఎవరూ సంప్రదించలేదు. సంప్రదిస్తే అపుడు ఆలోచన చేద్దాం' అని పేర్కొన్నారు.