ఆంధ్రోళ్ళతో పార్టీ పెట్టించడం ఎందుకు.. మళ్లీ సమైక్య రాష్ట్రం చేస్తే పోలే : జగ్గారెడ్డి

గురువారం, 11 ఫిబ్రవరి 2021 (21:40 IST)
కేంద్ర హోం మంత్రి అమిత్ షా వదిలిన బాణం వైఎస్ షర్మిల అని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆరోపించారు. ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ, తెలంగాణా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని లేకుండా చేసేందుకు కేసీఆర్‌, జగన్‌, అసదుద్దీన్‌ అమిత్‌షా బాణాలేనని ఆరోపించారు. 
 
తెలంగాణలో బలంగా ఉన్న కాంగ్రెస్ పార్టీని దెబ్బకొట్టాలని బీజేపీ చూస్తోందన్నారు. 'ఇవాళ షర్మిల వచ్చింది. రేపు జూనియర్‌ ఎన్టీఆర్‌, లేదంటే.. ఎన్టీఆర్‌ కుటుంబం నుంచి మరో వ్యక్తి వచ్చి పార్టీ పెట్టవచ్చు. ఇంతటి దానికి తెలంగాణ తెచ్చుకోవడం ఎందుకు? మళ్లీ సమైక్య రాష్ట్రం చేస్తే పోలే!' అని వ్యాఖ్యానించారు. 
 
మరోవైపు, బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేదరు రెడ్డి అయితే, సీఎం కేసీఆర్‌పై విమర్శలు గుప్పించారు. బీజేపీకి ప్రజాదరణ పెరుగుతుండడంతో ఫామ్ హౌస్ ప్రభుత్వం బయటకు వచ్చిందన్నారు. 
 
ఈయన గురువారం మీడియాతో మాట్లాడుతూ.. ఉద్యోగుల ప్రకటన, నాగార్జునసాగర్ సభ బీజేపీ ప్రభావమేనని వ్యాఖ్యానించారు. తెలంగాణ రాష్ట్రంలో వైఎస్ షర్మిలతో కొత్తపార్టీ పెట్టించే వ్యూహం కూడా సీఎం కేసీఆర్‎దేనని పేర్కొన్నారు. విశాఖ స్టీల్‌పై కొందరికి హక్కులు కల్పించడం వల్ల లాభాలు వస్తాయి. అంతేకాని ప్రైవేటీకరణ చేయడం లేదని గుజ్జుల అన్నారు. 
 
వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల స్థానం గెలిస్తే కేసీఆర్ ప్రభుత్వం పతనమైనట్టేనని జోస్యం చెప్పారు. ఎమ్మెల్సీగా పల్లా రాజేశ్వర్రెడ్డి విఫలం అయ్యారని.. దోచుకోవడమనే తప్పా పట్టభద్రులు, ఉద్యోగులకు చేసిందేమీ లేదని ఆయన విమర్శించారు. దుబ్బాక, హైదరాబాద్‎ గ్రేటర్ ఎలక్షన్‎లో బీజేపీ విజయంతో ఉద్యోగాల ప్రకటన విడుదల చేశారంటూ గుజ్జుల ఆరోపణలు చేశారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు