కాంగ్రెస్ పార్టీకి చెందిన లోక్‌సభ సభ్యుడు రేవంత్ రెడ్డి ఆకస్మిక నిర్ణయం తీసుకున్నారు. అచ్చంపేట నుంచి హైదరాబాద్‌కు ఆయన పాదయాత్ర ప్రారంభించారు. నిజానికి నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేటలో రాజీవ్ రైతు భరోసా దీక్షను ఆయన ఆదివారం చేపట్టారు. కానీ, ఆయన అనూహ్య రీతిలో మనసు మార్చుకుని తన దీక్షను పాదయాత్రగా మార్చేశారు.
అప్పటికప్పుడు అచ్చంపేట నుంచి హైదరాబాద్ కు పాదయాత్రగా బయల్దేరారు. రేవంత్ రెడ్డి నిర్ణయం మార్చుకోవడానికి కారణం కాంగ్రెస్ నేతలు మల్లు రవి, ధనసరి సీతక్క అని చెప్పాలి. వారి సూచనల మేరకు రేవంత్ పాదయాత్ర చేపట్టారు.
అంతకుముందు అచ్చంపేటలో దీక్ష సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, తాను నల్లమల బిడ్డనని, నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజల కోసం కొట్లాడే శక్తిని ఈ ప్రాంత ప్రజలు ఇచ్చారని ఉద్ఘాటించారు. రైతు కోట్లు సంపాదించేందుకు వ్యవసాయం చేయడని, బీరువాల్లో బంగారం నింపేందుకు వ్యవసాయం చేయడని, కేవలం ఆత్మగౌరవం కోసమే రైతు వ్యవసాయం చేస్తాడని స్పష్టం చేశారు.
"కేంద్రం తీసుకువచ్చిన కొత్త వ్యవసాయ చట్టాల ప్రకారం రైతులకు మార్కెట్ యార్డులు లేవు, మద్దతు ధరలు లేవు, రైతు జీవితాలు అదానీ, అంబానీల పరం కాబోతున్నాయి. రైతుల కష్టాలు ఇలా ఉంటే నేను కారెక్కి ఇంటికి ఎలా పోగలను? అందుకే ఇక్కడి నుంచే పాదయాత్ర చేస్తాను" అంటూ తన నిర్ణయాన్ని ప్రకటించారు.