క్వారంటైన్‌లోని రోగులకు మటన్ ఫ్రై - చికెన్ బిర్యానీ.. ఎక్కడ?

శనివారం, 25 ఏప్రియల్ 2020 (20:23 IST)
ముస్లిం సోదరుల పవిత్ర మాసమైన రంజాన్ నెల శనివారం ప్రారంభమైంది. ఈ మాసంలో ఆడామగా, చిన్నాపెద్దా అనే తేడా లేకుండా ముస్లింలంతా ఉపవాస దీక్షలు చేస్తుంటారు. ప్రతి రోజూ వేకువజాము నుంచి సాయంత్రం వరకు ఈ దీక్ష సాగుతుంది. ఈ దీక్షా సమయంలో పచ్చి మంచినీరు కూడా ముట్టుకోరు. సాయంత్రం దీక్ష ముగిసిన తర్వాతే ఆహారం తీసుకుంటారు. 
 
అయితే, ప్రస్తుతం కరోనా వైరస్ పట్టి పీడిస్తోంది. పైగా, ఈ వైరస్ బారినపడిన అనేక మంది ముస్లిం సోదరులు వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇలాంటి వారికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఓ తీపి కబురు చెప్పింది. క్వారంటైన్లలో ఉండే ముస్లింలకు వారి ఇళ్లలో తయారయ్యే వంటకాల మాదిరే ఆహారాన్ని అందించాలని నిర్ణయించింది. ఈ మెనూను శనివారం నుంచి అమల్లోకి తెస్తూ ఆదేశాలు జారీచేసింది. 
 
కాగా, రంజాన్ మాసం ప్రారంభంకావడంతో క్వారంటైన్లలో ఉండే ముస్లిం రోగులు కూడా ప్రతి రోజూ వేకువజాము నుంచే ఉపవాస దీక్షలు ప్రారంభిస్తారు. ఈ సమయంలో షెహరిగా రొట్టెలు, దాల్, వెజ్ కర్రీ అందించనున్నారు. 
 
సాయంత్రం ఉపవాస దీక్ష అనంతరం ఇఫ్తార్ విందులో చికెన్ బిర్యానీ, వెజ్ బిర్యానీ, కిచిడీ, బగారా రైస్, దాల్చా అందిస్తారు. అల్పాహారంగా ఖర్జూరం పండ్లు, అరటి పండ్లు, ఇతర పండ్లను అందిస్తారు. 
 
రోజు విడిచి రోజు చికెన్ కర్రీ లేదా మటన్ కర్రీ అందిస్తారు. మరోవైపు సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ముస్లిమేతరులను మరొక గదిలోకి తరలించినట్టు సమాచారం. ఎందుకంటే ఈ ముస్లిం రోగులు తమ గదిలో నమాజ్ చేసుకునేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు