చంద్రయాన్-3 లైవ్ స్ట్రీమింగ్.. తెలంగాణాలో స్కూల్స్, కాలేజీలకు సెలవు
మంగళవారం, 22 ఆగస్టు 2023 (17:54 IST)
తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ బుధవారం విద్యా సంస్థలకు సెలవు ప్రకటించింది. ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ఉత్కంఠభరితంగా చూస్తున్న ఇస్రో చేపట్టిన చంద్రయాన్-3 ప్రయోగంలో భాగంగా విక్రమ్ ల్యాండర్ బుధవారం సాయంత్రం 6.04 నిమిషాలకు చంద్రుడి దక్షిణ ధృవంపై అడుగుపెట్టనుంది. ఈ అద్భుత క్షణాలను ఇస్రో ప్రత్యక్ష ప్రసారం చేస్తుంది. ఈ దృశ్యాలను ప్రభుత్వ కాలేజీలు, స్కూళ్లలో ప్రత్యేక తెరలపై ప్రత్యక్షం చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.
ఈ మేరకు డీఈవోలు, ప్రిన్సిపాళ్లకు పాఠశాల విద్యాశాఖ డెరెక్టర్ ఉత్తర్వులు జారీచేశారు. దీంతో తెలంగాణ విద్యా చానెల్స్ టీశాట్, నిపుణలో లైవ్ టెలికాస్ట్ చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రత్యేక స్క్రీన్లు, ప్రొజెక్టర్లు ఏర్పాటు చేసి విద్యార్థులకు చూపిస్తామని అధికారులు తెలిపారు. చంద్రయాన్ ల్యాండింగ్‌ను యువత చూడాలని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో విజ్ఞప్తి చేసింది. చంద్రయాన్-3 సేఫ్ ల్యాండింగ్ కోసం ప్రార్థించాలని దేశ ప్రజలను కోరింది.
మరికొన్ని గంటల్లో జాబిల్లిని ముద్దాడనున్న 'విక్రమ్ ల్యాండర్'
జాబిల్లి దక్షిణ ధృవం అధ్యయనం కోసం భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్-3 ప్రయోగం భవితవ్యం మరికొన్ని గంటల్లో తేలనుంది. ఇందులో అమర్చిన విక్రమ్ ల్యాండర్ సాఫ్ట్‌ల్యాండింగ్‌కు మరికొన్ని గంటలే మిగిలివున్నాయి. బుధవారం సాయంత్రం 6.04 గంటలకు జాబిల్లిని ముద్దాడనుంది. ఈ అద్భుత క్షణాలను ఇస్రో బుధవారం సాయంత్రం 5.20 గంటల నుంచి ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. ఇందుకోసం యావత్ ప్రపంచం ఉత్కంఠ భరితంగా ఎదురు చూస్తుంది. జాబిల్లి దక్షిణ ధ్రువం వద్ద సురక్షితంగా దిగి చరిత్ర సృష్టించేందుకు 'చంద్రయాన్-3' లోని విక్రమ్ ల్యాండర్ సన్నద్ధమవుతోంది.
ఇప్పటికే భూమి నుంచి కనిపించని చందమామ ఆవలి వైపునకు సంబంధించిన ఫొటోలను తాజాగా అది పంపించింది. 2019లో చంద్రయాన్-2 మిషన్‌లో భాగంగా పంపించిన ఆర్బిటర్‌తో 'విక్రమ్' అనుసంధానమవడం తాజాగా చోటుచేసుకున్న మరో కీలక పరిణామం. జాబిల్లి చుట్టూ తిరుగుతున్న చంద్రయాన్-2 ఆర్బిటర్‌తో చంద్రయాన్ -3 ల్యాండర్‌ను విజయవంతంగా అనుసంధానించినట్లు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) సోమవారం ట్విటర్ వేదికగా వెల్లడించింది.
'మిత్రమా.. స్వాగతం! అంటూ విక్రమ్‌కు పాత ఆర్బిటర్ స్వాగతం పలికింది. ఆ రెండింటి మధ్య పరస్పర సమాచార మార్పిడి వ్యవస్థ స్థాపితమైంది. ల్యాండర్ మాడ్యుల్‌ను సంప్రదించేందుకు బెంగళూరులోని ఇస్రో టెలీమెట్రీ, ట్రాకింగ్, కమాండ్ నెట్‌వర్కింగ్ కేంద్రానికి ఇప్పుడు మరిన్ని దారులు తెరుచుకున్నట్లయింది' అని ట్వీట్ చేసింది. చంద్రయాన్-2 ఆర్బిటర్ మిషన్ జీవితకాలం ఏడేళ్లని 2019లో ఇస్రో తెలిపిన సంగతి గమనార్హం.
ఇదిలావుంటే, చంద్రుడి ఉపరితలంపై విక్రమ్ దిగే సాఫ్ట్ ల్యాండింగ్ ప్రక్రియ ప్రత్యక్ష ప్రసారం బుధవారం 5:20 గంటల నుంచి ప్రారంభమవుతుందని ఇస్రో తెలిపింది. అన్నీ అనుకూలిస్తే అదేరోజు సరిగ్గా సాయంత్రం 6.04 గంటలకు జాబిల్లిపై ల్యాండర్ దిగనుంది.