విజయవాడ: బెజవాడ కార్పొరేటర్ ఉమ్మడి వెంకటేశ్వరరావు, అలియాస్ చంటి అరెస్టుకు రంగం సిద్ధం అయింది. ఒక మహిళా ప్రొఫెసన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు తెలంగాణా పోలీసులు అరెస్ట్ వారెంట్‌తో విజయవాడ చేరుకున్నారు. భవానీపురంలోని చంటి ఇంటి వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. విజయవాడ మున్సిపల్ కార్పొరేటర్లు ఢిల్లీకి విహార యాత్రకు వెళ్ళినపుడు ఢిల్లీ నుంచి గన్నవరం వచ్చే విమానంలో తన పక్క సీటులో ఉన్న మహిళా ప్రొఫెసర్‌తో అసభ్యంగా ప్రవర్తించారని చంటిపై ఫిర్యాదు నమోదు అయింది.
ఆ మహిళ శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో దిగిన వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన పక్క సీటులో కూర్చున్న కార్పొరేటర్ కావాలనే తనని చాలాసార్లు తాకాడని, అసభ్యంగా ప్రవర్తించాడని ఆమె ఫిర్యాదు చేశారు. అక్కడికక్కడే కార్పొరేటర్‌ని విచారించాలని ఎయిర్‌పోర్ట్ పోలీసులు చూశారు. కానీ, అప్పటికే కార్పొరేటర్ చంటి ఇతర సహచరులతో గన్నవరం ఎయిపోర్ట్‌కి వచ్చేయడం... అక్కడి నుంచి విజయవాడ చేరుకోవడం జరిగిపోయింది. ఈ ఉదంతంపై బెజవాడలో మహిళా సంఘాలు ఉద్యమించాయి. ప్రొఫెసర్‌తో అసభ్యంగా ప్రవర్తించిన కార్పొరేటర్ పైన చర్య తీసుకోవాలని ధర్నాలు చేశాయి. దీనితో రాజకీయంగా రచ్చ అయింది.
తను నిద్రలో ఉండగా, పక్కన కూర్చున్న మహిళ కాలు తగిలిందని... అంతకన్నా ఏమీ కాలేదని కార్పొరేటర్ చంటి వివరణ కూడా ఇచ్చుకున్నారు. అందుకు సారీ కూడా చెపుతున్నా అన్నారు. ఈ లోగా టీడీపీ ఎమ్మెల్సీ వై.బి.రాజేంద్ర ప్రసాద్ కలుగజేసుకుని... ఆమె పర్వర్టెడ్ ఫెమినిస్ట్ అని, గతంలో 70 ఏళ్ల వృద్ధుడిపై రేప్ కేస్ పెట్టిందని కామెంట్స్ చేశారు. అది కాస్తా, ఇపుడు రచ్చ అయి కూర్చుంది. టీడీపీ కార్పొరేటర్ చంటి కొంప మీదకు తెచ్చింది.