సర్.. నాకు ఇష్టంలేని పెళ్లి చేస్తున్నారు. నన్ను రక్షించండి ప్లీజ్ అంటూ ఓ వధువు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై తక్షణమే స్పందించినచ పోలీసులు... మండపానికి చేరుకుని పెళ్లిని నిలిపివేసి, వధువును రక్షించారు. అయితే, పీటలపై పెళ్లి ఆగిపోవడాన్ని అవమానంగా భావించిన వరుడి తల్లిదండ్రులు పెళ్లికొచ్చిన సమీప బంధువైన అమ్మాయితో అదే ముహూర్తానికి పెళ్లి జరిపించారు. ఈ ఘటన తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్ నగర్ జిల్లా మరిపెడలో జరిగింది.
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, మహబూబ్‌నగర్ జిల్లా మరిపెడలం మండలంలోని గుండెపూడికి చెందిన యువకుడికి, కురవి మండలం కాంపెల్లికి చెందిన యువతితో వివాహం నిశ్చయమైంది. గురువారం పెళ్లి తంతు ప్రారంభమైంది. మరికాసేపట్లో వధువు మెడలో వరుడు మూడుముళ్లు వేయాల్సిందే.
అంతలోనే మండపంలోకి పోలీసులు ప్రవేశించడంతో అందరూ అవాక్కయ్యారు. తనకు ఈ వివాహం ఇష్టం లేదని, తానో యువకుడిని ప్రేమించానని, దయచేసి ఈ పెళ్లిని ఆపాలంటూ మండపం పైనుంచే రహస్యంగా పోలీసులకు ఫిర్యాదు చేసింది.
దీంతో అక్కడికి చేరుకున్న మరిపెడ సీఐ, ఎస్సైలు వధువును సమీపించి విషయం ఆరా తీశారు. పెళ్లి చేసుకోవాలంటూ నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ ఆమె ససేమిరా అనడంతో చేసేది లేక కౌన్సెలింగ్ కోసం సఖి కేంద్రానికి తరలించారు.