జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు ముహూర్తం ఖరారు!

శుక్రవారం, 6 నవంబరు 2020 (08:32 IST)
గ్రేటర్ హైదరాబాద్  ఎన్నికలకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే ఓటర్ల తుది జాబిత షెడ్యూల్ కూడా విడుదల చేశారు. అయితే ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారనే అంశంపై కూడా తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు క్లారిటీ ఇచ్చారు.

జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు సంబంధించి తుది ఓటరు జాబితా ఈ నెల 13న రానుంది. నవంబర్‌ 13 తర్వాత ఎప్పుడైనా ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలయ్యే అవకాశం ఉందని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్‌ పార్థసారధి తెలిపారు. జీహెచ్‌ఎంసీలో 150 వార్డులు, 30 సర్కిళ్లు ఉన్నాయని.. ప్రతి సర్కిల్‌కు ఒక డిప్యూటీ కమిషనర్‌ ఉన్నారని వెల్లడించారు. 

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కు ఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాట్లు మొదలైన‌ట్టు తెలిపారు. ఓటర్ల జాబితా ప్రచురణకు సంబంధించి నోటిఫికేషన్ జారీ చేశామన్నారు. ఈ నెల 7వ తేదీలోగా ముసాయిదా ఓటర్ల జాబితా జారీ అవుతుందన్నారు. ఈ నెల 8 నుంచి 11వ తేదీ వరకు జాబితాపై అభ్యంతరాల్ని స్వీకరించనున్నారు.

తుది జాబితా ఈనెల 13న వెలువరించనున్నారు. గ్రేటర్ ఓటర్ల తుది జాబితా ప్రచురించిన తరువాత ఎప్పుడైనా రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేస్తుందని తెలిపారు. 150 డివిజన్లకు 150 మంది ఆర్‌ఓలను నియమించినట్లు కమిషనర్ పార్థసారధి పేర్కొన్నారు. ప్రతి వార్డుకు సగటున 50 పోలింగ్‌ కేంద్రాలు ఉంటాయని వెల్లండిచారు.

పోలింగ్‌ను బ్యాలెట్ బాక్సుల ద్వారా నిర్వహించాల‌ని రాష్ట్ర ఎల‌క్షన్ క‌మిష‌న్ నిర్ణయించ‌డంతో 30 వేల బ్యాలెట్ బాక్సులు అవ‌స‌ర‌మ‌వుతాయ‌ని అంచ‌నా వేశారు. నామినేషన్ల స్వీకరణ నుంచి మొదలుకుని ఫలితాలు వెలువడేవరకూ తీసుకోవల్సిన చర్యలు, చేయాల్సిన బాధ్యతలకు సంబంధించి చెక్ లిస్ట్ తయారు చేసుకోవాలన్నారు.

ఇక ఏపీలో జరిగిన స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌కు తెలంగాణ‌లోని వివిధ జిల్లాల నుండి 30వేల బ్యాలెట్ బాక్సుల‌ను పంపిన‌ట్లు తెలిపారు. ఆ బ్యాలెట్‌ బ్యాక్సులనే జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో వాడునున్నారని సమాచారం.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు