తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలోని తెరాస ప్రభుత్వం ప్రవేశపెట్టే చివరి బడ్జెట్ ఇదేనని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి జోస్యం చెప్పారు. సోమవారం నుంచి తెలంగాణ అసెంబ్లీ జరుగనుంది. దీంతో ఆదివారం కాంగ్రెస్ శాసనసభాపక్ష సమావేశం జరిగింది. ఇందులో బడ్జెట్‌లో అనుసరించాల్సిన వ్యాహాలపై చర్చించారు.
ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, సీఎం కేసీఆర్ సర్కారు అసెంబ్లీలో ప్రవేశపెట్టే చివరి బడ్జెట్ ఇదేనని చెప్పారు. అసెంబ్లీ సమావేశాల్లో మైనార్టీల అభివృద్ధిని ప్రస్తావిస్తామన్నారు. కేవలం నలుగుర అధికారుల వద్దే 40 శాఖలు ఉన్నాయన్నారు.
ప్రధాన కార్యదర్శిగా ఉన్న సోమేష్ కుమార్ ఆంధ్రాకు కేటాయించిన అధికారి అని, ఆయన్ను సీఎం కేసీఆర్ అట్టిపెట్టుకుని ఎనిమిది శాఖలను కట్టబెట్టారన్నారు. సుల్తానియా వద్ద ఆరు శాఖలు ఉన్నాయన్నారు. అధికారుల అండతో సీఎం కేసీఆర్ వేల కోట్ల రూపాయలను కొల్లగొడుతున్నారని మండిపడ్డారు.
అయితే, తన మాటలను కాంగ్రెస్ పార్టీ నేతలు కొందరు వక్రీకరిస్తున్నారంటూ మండిపడ్డారు. తాను అవగాహన లేకుండా, ఊరకనే మాట్లాడటం లేదన్నారు. తెలివితక్కువగా మాట్లాడటం లేదని, ఒక పీసీసీ చీఫ్‌గా మాట్లాడుతున్నానని రేవంత్ రెడ్డి ఘాటుగా వ్యాఖ్యానించారు.