తెలంగాణాలో వెరైటీ రూల్.. హెల్మెట్ లేదనీ ట్రాక్టర్ డ్రైవర్‌కు ఫైన్!!!

గురువారం, 4 మార్చి 2021 (08:10 IST)
తెలంగాణ రాష్ట్ర పోలీసులు దేశంలోనే అత్యుత్తమ సేవలు అందిస్తున్నారంటూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, హోం మంత్రి మహ్మద్ అలీలు పదేపదే చెబుతుంటారు. అలాంటి పోలీసులు చేసే కొన్ని విచిత్ర పనులు కూడా దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతున్నాయి. 
 
తాజాగా హెల్మెట్ లేదన్న కారణంతో ఓ ట్రాక్టర్ డ్రైవర్‌కు అపరాధం విధించారు. ఈ సంఘటన కామారెడ్డి జిల్లాలోని బీర్కూరు మండలం చించొల్లి గ్రామంలో జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే, చించొల్లి గ్రామానికి చెందిన సతీష్‌ అనే డ్రైవర్ హెల్మెట్ లేకుండా ట్రాక్టర్ నడిపాడంటూ ట్రాఫిక్ పోలీసులు రూ.1,035 చలానా పంపారు. గత నెల 25న మద్దికుంటమర్రి క్రాస్‌రోడ్డులో హెల్మెట్ లేకుండా ట్రాక్టర్ నడిపినట్టు అందులో పేర్కొన్నారు. 
 
అది చూసిన సతీష్ విస్తుపోయాడు. హెల్మెట్ లేనందుకు చలానా విధించడం ఇది తొలిసారి కాదని, ఇప్పటివరకు మూడుసార్లు ఇలా చలానా పంపారని సతీష్ ఆవేదన వ్యక్తం చేశాడు. తనకు పదేపదే చలానాలు పంపిస్తున్న పోలీసులపై చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను సతీష్ వేడుకున్నాడు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు