కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా రూపొందించిన ప్రత్యేక గీతాలను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విడుదల చేశారు. ఈ పాటలను ప్రముఖ నేపథ్య గాయకులు రాహుల్ సిప్లిగంజ్, మధుప్రియ పాడారు. కేసీఆర్ పుట్టిన రోజైన ఈనెల 17న జంట నగరాల్లోని ఆలయాల్లో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహిస్తామని చెప్పారు.
ఎమ్మెల్సీ కవిత బల్కంపేట ఎల్లమ్మకు బంగారు చీరను సమర్పిస్తారని వెల్లడించారు. అమ్మవారికి పంచామృతాలతో ప్రత్యేక అభిషేకం, మృత్యుంజయ హోమం, ఆయుష్షు హోమం, అన్నప్రసాద పంపిణీతో నిర్వహిస్తామని చెప్పారు. అలాగే 300 మంది మహిళలకు చీరల పంపిణీ చేస్తున్నామని వెల్లడించారు.
నేటి నుంచి 17 వరకు ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయంలో కోటి కుంకుమార్చన, 17న హోమం, సికింద్రాబాద్ గణేష్ దేవాలయంలో గణపతి కల్యాణం, అన్నప్రసాద కార్యక్రమం, నాంపల్లిలోని హజరత్ దర్గాలో దట్టీ సమర్పణ, పేదలకు పండ్లు పంపిణీ చేస్తామన్నారు. సీఎం కేసీఆర్ సుపరిపాలన సాగించాలని గురుగ్రంధ సాహెబ్‌లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తామన్నారు.
జలవిహార్‌లో కేసీఆర్ బాల్యం, రాజకీయ ప్రస్థానం, తెలంగాణ ఉద్యమ నేపథ్యంపై 3డీ గ్రాఫిక్స్‌లో 30 నిమిషాల డాక్యుమెంటరీ ప్రదర్శన ఉంటుందన్నారు. బోయిగూడ వృద్ధుల ఆశ్రమంలో పండ్ల పంపిణీ, అన్నదాన కార్యక్రమం ఏర్పాటుచేశామన్నారు. కోటి వృక్షార్చనలో భాగంగా జలవిహార్‌లో మొక్కలు నాటుతామని చెప్పారు.