తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం రోగులు ఉన్న అంబులెన్సులను అనుమతిచ్చింది. కరోనా లాక్డౌన్ కారణంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సరిహద్దుల్లో కరోనా రోగుల అంబులెన్స్‌లను అడ్డుకుంటున్న విషయం తెల్సిందే. దీనిపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
కాగా, తెలంగాణలోని సూర్యాపేట జిల్లా కోదాడ మండలం రామాపురంలోని అంతర్రాష్ట్ర సరిహద్దుతో పాటు కర్నూలు జిల్లా పుల్లూరు టోల్‌గేట్ వద్ద తెలంగాణ పోలీసులు గత రెండు రోజులుగా తనిఖీలు చేసి అంబులెన్సులను అడ్డుకున్నారు.
ఆసుపత్రులు తన ల్యాండ్ లైన్ నంబర్ల నుంచి ఫోను చేసి రోగులను పంపాలని చెబితేనే పంపారు. ఇక, నేటి నుంచి లాక్డౌన్ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో అత్యవసర, వైద్య, నిత్యావసర సరుకుల వాహనాలకు అనుమతి ఇస్తున్నారు.
కాగా, అంబులెన్స్‌ల అడ్డుకోవడంపై తెలంగాణ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెల్సిందే. ముఖ్యంగా, అంబులెన్సులను అడ్డుకోవడం రాజ్యాంగ విరుద్ధమని, అస్సలు అంబులెన్సులను అడ్డుకునే అధికారం ఎవరిచ్చారంటూ హైకోర్టు కాస్త కఠువుగా ప్రశ్నించింది. దీంతో తెలంగాణ పోలీసులు వెనక్కి తగ్గారు.