వర్మ 'వంగవీటి' కోసం రంగంలోకి దిగనున్న 'సర్కార్' అమితాబ్... 'శివ' నాగార్జున కూడా...

శుక్రవారం, 9 డిశెంబరు 2016 (11:24 IST)
ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ తాజా చిత్రం 'వంగవీటి'. బెజవాడ రాజకీయ కక్షలతో పాటు... కమ్మ - కాపు కులాల మధ్య ఉన్న వైరాన్ని కథాంశంగా తీసుకుని తెరకెక్కించిన చిత్రం. ఈ చిత్రానికి వంగవీటి రంగా కుమారుడు వంగవీటి రాధ, వంగవీటి రంగా భార్య ఇప్పటికే తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇదే అంశంపై వంగవీటి కుటుంబ సభ్యులతో దర్శకుడు రాంగోపాల్ వర్మ జరిగిన చర్చలు కూడా పూర్తిగా విఫలమయ్యాయి. దీంతో ఈ చిత్రం విడుదలపై అనేక సందేహాలు నెలకొనివున్నాయి. 
 
ఈ నేపథ్యంలో... 'వంగవీటి' సినిమాను ప్రమోట్ చేయడానికి బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ రంగంలోకి దిగడం టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్‌గా మారింది. ఈ మధ్య విజయవాడలో జరిగిన 'వంగవీటి' ఆడియో ఫంక్షన్ తర్వాత తిరిగి హాట్ న్యూస్‌లోకి వచ్చిన తన వంగవీటి సినిమాకు మరింత క్రేజ్ తీసుకు రావడానికి వర్మ మరో మాస్టర్ ప్లాన్ రచించాడు.
 
ఈ సినిమాకు అమితాబ్‌కు ఎటువంటి సంబంధం లేకపోయినా వర్మ దాదాపు కోటి రూపాయల ఖర్చుతో త్వరలో చేయబోతున్న ఈ సినిమా ప్రమోషన్ ఫంక్షన్ కోసం అమితాబ్ ముఖ్య అతిథిగా రాబోతున్నాడు. ఈ ఫంక్షన్‌లో నాగార్జున నుంచి అమితాబ్ వరకు ఇప్పటి వరకు వర్మ సినిమాలలో నటించిన నటీనటులు ఈ 'వంగవీటి' ప్రమోషన్ ఫంక్షన్‌లో పాల్గొన పోతున్నారన్నది ఫిల్మ్ నగర్ టాక్. 
 
ఈ ఫంక్షన్ హైదరాబాద్‌లో ఈనెల 20న జరగబోతోంది. వర్మ తీసిన మొదటి సినిమా 'శివ' నుంచి ప్రస్తుతం తీస్తున్న 'సర్కార్ 3' వరకు వర్మ సినీ ప్రయాణాన్ని విశ్లేషించే ఫంక్షన్‌గా ఈ కార్యక్రమాన్ని రూపొందిస్తున్నారని తెలుస్తోంది. ఈ ఫంక్షన్‌లోనే వర్మ తన వంగవీటి ప్లాటినమ్ డిస్క్ ఫంక్షన్ కూడా కలిపి నిర్వహిస్తాడట. వర్మ వేస్తున్న ఈమెగా పబ్లిసిటీ స్కెచ్‌ను చూసి చాలామంది ఆశ్చర్య పోతున్నారు. ఒక రాజకీయ సినిమాకు ఈ స్థాయిలో టాప్ రేంజ్‌లో వర్మ పబ్లిసిటీ చేయడం వెనుక ఎదో ఒక సీక్రెట్ ఎజెండాతో పాటు దీని వెనుక ఒక అదృశ్య హస్తం ఉంది అన్న ప్రచారం ప్రస్తుతం ఫిలింనగర్‌లో జోరుగా సాగుతోంది. 

వెబ్దునియా పై చదవండి