4కె స్క్రీన్‌పై బాహుబలి.. ఒక్క థియేటర్‌లో రూ.3.50 కోట్ల లాభం!

ఆదివారం, 22 జనవరి 2017 (17:27 IST)
తెలుగు సినిమా స్థాయిని ప్రపంచానికి చాటి చెప్పిన బాహుబలి చిత్రానికి సీక్వెల్‌గా బాహుబలి-2 తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ జక్కన్న రాజమౌళి ఈ సినిమాను ఏప్రిల్ 28న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అయితే బాహుబలిలో కంటే బాహుబలి2 సినిమాలో గ్రాఫిక్స్‌కు, విజువల్ ఎఫెక్ట్స్‌కు ఎంతో ప్రాముఖ్యత ఉంది.  
 
ఇందుకోసం ఈ సినిమా విడుదలయ్యే థియేటర్లలో కొన్నింటికి సంబంధించి ఓ నిర్ణయం తీసుకున్నారు. 4కె రిజల్యూషన్‌తో కూడిన ప్రొజెక్టర్స్‌తో సినిమాను వెండితెరపై ఆవిష్కరించాలని నిర్ణయం తీసుకున్నారు. దేశవ్యాప్తంగా దాదాపు 200ల థియేటర్లు బాహుబలి-2 కోసం అడ్వాన్స్డ్ టెక్నాలజీతో కొత్త సొబగులు అద్దుకోనున్నాయి. 
 
కొందరు మాత్రం 4కె ప్రొజెక్టర్స్ అద్దెకు తెచ్చుకుని ఈ సినిమాను విడుదల చేయాలని భావిస్తున్నారట. థియేటర్ యాజమాన్యాలు బాహుబలి-2పై ఇంత నమ్మకం పెట్టుకోవడానికి కారణం లేకపోలేదు. బాహుబలి సినిమాను కేరళలోని తిరువనంతపురంలోని ఓ థియేటర్‌లో 4కె స్క్రీన్‌పై ప్రదర్శించారు. ఈ ఒక్క థియేటర్‌లో ఈ టెక్నాలజీ సాయంతో సినిమా ప్రదర్శించడం వల్ల 3.50 కోట్ల రూపాయల లాభం వచ్చిందట. ఇదీ అసలు విషయం. 

వెబ్దునియా పై చదవండి