మెగాస్టార్ చిరంజీవి స్పీడ్ పెంచారు. రాజకీయాలకు స్వస్తి చెప్పి తిరిగి తన పాత వృత్తిలోకి వచ్చిన మెగాస్టార్... వరుస చిత్రాల్లో నటించేందుకు కమిట్ అవుతున్నారు. ఇప్పటికే డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కిస్తున్న "ఆచార్య" చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ కరోనా మహమ్మారి కారణంగా ఆగిపోయింది. అయినప్పటికీ.. ఆయన తన కొత్త ప్రాజెక్టులకు పచ్చజెండా ఊపుతున్నారు.
ఈ కోవలో మలయాళంలో సూపర్ హిట్ అయిన 'లూసిఫర్' చిత్రాన్ని రీమేక్ చేయనున్నారు. ఈ చిత్రానికి వివి వినాయక్ దర్శకత్వం వహిస్తుంటే, తన కుమారుడు రాంచరణ్ తెరకెక్కిస్తున్నాడు. ఇకపోతే, తమిళ హీరో అజిత్ నటించిన 'వేదాళం' చిత్రాన్ని కూడా చిరంజీవి రీమేక్ చేయనున్నారు. దీనికి మెహర్ రమేష్ దర్శకత్వం వహించనున్నారు.
ఈ చిత్రం ప్రీప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా సాగుతున్నాయి. ఇందులో చిరంజీవి చెల్లిగా కుర్ర హీరోయిన్ సాయిపల్లవి నటించనుంది. అలాగే, మణిశర్మ సోదరుడు సాగర్ ఈ చిత్రానికి సంగీత బాణీలు సమకూర్చనున్నారు. 'ఆచార్య' చిత్రం షూటింగ్ పూర్తయిన తర్వాత 'లూసిఫర్'తో పాటు.. 'వేదాళం' చిత్రాలను ఒకేసారి సెట్స్‌పైకి తీసుకెళ్లాలని మెగాస్టార్ నిర్ణయించి, ఆ ప్రకారంగా తన డేట్స్‌ను సర్దుబాటు చేసుకుంటున్నారు.
అయితే, ఈ 'వేదాళం' చిత్రాన్ని కోల్‌కతా బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కించనున్నారు. ఈ చిత్ర కథకు కోల్‌కతా నగరానికి మధ్య ఏదో లింకు ఉంది. అందుకే కోల్‌కతా బ్యాక్‌డ్రాప్‌లో నిర్మించాలని ప్లాన్ చేస్తున్నారు. గతంలో చిరంజీవి నటించిన "చూడాలని వుంది" చిత్రం ఇదే బ్యాక్‌డ్రాప్‌లో వచ్చి సూపర్ హిట్ అయిన విషయం తెల్సిందే. ఈ చిత్రానికి గుణశేఖర్ దర్శకత్వం వహించగా, ప్రముఖ నిర్మాత సి.అశ్వనీదత్ ఈ చిత్రాన్ని నిర్మించిన విషయం తెల్సిందే.