బాలీవుడ్ సొట్టబుగ్గల సుందరి ప్రీతి జింతాకు ఎయిర్‌పోర్ట్‌లో చేదు అనుభవం ఎదురైయింది. ముంబై నుంచి దిల్లీ వెళ్లడానికి ఎయిర్‌వేస్‌లో టిక్కెట్ బుక్ చేసుకుందట. తీరా ఎయిర్ పోర్ట్‌కి వెళ్లిన తర్వాత ఆమెకు ఎయిర్‌వేస్ విమాన సంస్థ హ్యాండ్ ఇచ్చింది. ఆ వివరాలను పరిశీలిస్తే... ముంబై నుంచి ఢిల్లీకి బయలుదేరేందుకు ఈ అమ్మడు జెట్‌ఎయిర్‌వేస్ టికెట్టు బుక్ చేసుకుంది. అయితే విమానం బయలుదేరడానికి గంటన్నర ఆలస్యం కావడంతో సిబ్బంది ఆమెకు ఓ గెస్ట్ రూమ్‌ని కేటాయించారు.
అయితే విమానం బయలుదేరే ముందు సిబ్బంది ప్రీతి వెయిటింగ్ రూంలో ఉందన్న విషయం మరిచిపోయి టేకాఫ్ చేసేశారట. కానీ ఆ విషయాన్ని ఎనౌన్స్ చేయలేదని ప్రీతి మండిపడుతోంది. తనంతట తాను వెళ్లి అడిగితే సిబ్బంది కూల్‌గా సమాధానం చెప్పారట. దీంతో ఆగ్రహానికిలోనైనా ప్రీతి ట్విట్టర్ ఖాతా ఓపెన్ చేసి.. ''జెట్ ఎయిర్‌వేస్ గంటన్నర ఆలస్యం అయ్యింది. ఆ తర్వాత బోర్డింగ్ విషయం చెప్పకుండా టేకాఫ్ చేశారు. ఆలస్యంగా వచ్చినందుకు, నేను ఫ్లైట్ మిస్సయ్యేలా చేసినందుకు, ఇక ఎప్పుడూ మీ విమానంలో నన్ను ప్రయాణించకుండా చేసినందుకు థ్యాంక్యూ జెట్ ఎయిర్‌వేస్'' అంటూ ట్వీట్ చేసింది.
అయితే దీనిపై అధికారులు మాత్రం వేరే సాకులు చెబుతున్నారు. ఆమె ఎక్కాల్సిన విమానం ఎక్కలేదని, ఏదో పార్శిల్ కోసం ఎదురుచూస్తూ విశ్రాంతి గదిలో ఉండిపోయారని, ఇందులో తమ తప్పులేదని జెట్ ఎయిర్‌వేస్ అధికారులు వివరణ ఇచ్చారు.