సుకుమార్ దర్శకత్వంలో చెర్రీ, సమంత నటిస్తున్న ఈ చిత్రం గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కింది. షూటింగ్ కూడా చివరి దశకు చేరుకుంది. వచ్చేనెల పాటలను విడుదల చేయనున్నారు. వచ్చే నెలలో పాటల చిత్రీకరణ కూడా వుంటుందని సమాచారం. అన్నీ పనులను ఫిబ్రవరిలో పూర్తి చేసుకుని మార్చి 16న సినిమాను విడుదల చేయాలని సినీ యూనిట్ భావిస్తోంది. ఇక రంగస్థలం ఫస్ట్ లుక్, ట్రైలర్ ఎప్పుడొస్తుందా అని మెగా ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.
ఇకపోతే.. బాబాయ్ అజ్ఞాతవాసి సినిమా జనవరి 10వ తేదీన రిలీజ్ కానున్న తరుణంలో.. రంగస్థలంను చెర్రీ వాయిదా వేసినట్లు తెలుస్తుండగా, మరోవైపు మెగాస్టార్ చిరంజీవి 151వ సినిమా సైరా నరసింహారెడ్డి చిత్రానికి చెర్రీ నిర్మాత కావడంతో.. నటీనటుల ఎంపిక పనుల్లో బిజీగా వున్నారని.. అందుకే రంగస్థలం వాయిదా పడుతూ వస్తోందని సినీ జనం అంటున్నారు.