తాను నటించిన రెండో చిత్రంతోనే టాలీవుడ్లో సూపర్‌స్టార్ రేంజ్‌కు చేరుకున్న జూనియర్ మెగాస్టార్ రామ్‌చరణ్ క్రేజ్‌కు చెక్ పెట్టాలన్న బలమైన పట్టుదలతో జూనియర్ ఎన్టీఆర్ ఉన్నారు. ఇందుకోసం తన తదుపరి చిత్రం "మగధీర" రికార్డులను బ్రేక్ చేసేలా ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు.
తాను పలు చిత్రాల్లో నటించినప్పటికీ.. "మగధీర" వంటి బంపర్ హిట్ విజయాన్ని తెలుగు ప్రేక్షకులకు ఇవ్వలేక పోయాననే లోటు జూనియర్ ఎన్టీఆర్‌లో ఉంది. పైపెచ్చు.. రామ్‌చరణ్ రెండో చిత్రంతోనే సూపర్‌స్టార్ రేంజ్‌కు చేరుకోవడం ఒక్క జూనియర్‌కు మాత్రమే కాకుండా కుర్రకారు హీరోలకు ఏమాత్రం మింగుడుపడటం లేదు.
"మగధీర" చిత్రానికి దర్శకత్వం వహించిన ఎస్.ఎస్.రాజమౌళి తమ చిత్రాలకు లోగడ దర్శకత్వం వహించినప్పటికీ.. "మగధీర" చిత్రం అంతటి విజయాన్ని సాధించలేక పోవడం కూడా వీరిలో మరింత కసిని పెంచింది. ఈ విషయంలో జూనియర్ ఎన్టీఆర్ మరింత పట్టుదలతో ఉన్నారు. అందుకే తాను నటిస్తున్న "అదుర్స్" చిత్రం ఇదే తరహాలో విజయం సాధించేలా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
ఈ చిత్రానికి మాస్ డైరక్టర్ వి.వి.వినాయక్ దర్శకత్వం వహిస్తుండటం కూడా జూనియర్ ఆశలకు ఒక కారణంగా చెప్పుకోవచ్చు. అయితే, చిత్రంలో హీరోయిన్గా నయనతార నటిస్తుండటం జూనియర్‌ను ఒకింత భయానికి లోను చేస్తోంది. గత కొంతకాలంగా నయనతార నటించిన అనేక చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బోల్తాపడుతున్నాయి. ఇదే సెంటిమెంట్ తన కొత్త చిత్రానికి వస్తుందేమోనన్న సందేహం జూనియర్‌ను వెంటాడుతోంది.
అంతేకాకాకుండా, "మగధీర" చిత్రం ఇప్పటికే 62 కోట్ల రూపాయలను వసూలు చేసినట్టు సమాచారం. ఈ చిత్రం వంద రోజులను పూర్తి చేసుకోవడమే కాక సరికొత్త రికార్డును సృష్టించడం ఖాయమని చిత్ర పరిశీలకులు భావిస్తున్నారు.
గతంలో ప్రిన్స్ మహేష్ బాబు నటించిన "పోకిరి" చిత్రం రికార్డులు తుడిచి పెట్టుకుని పోగా.. భవిష్యత్‌లో ఏ హీరో కూడా బ్రేక్ చేయలేని విధంగా రామ్‌చరణ్ రికార్డును నెలకొల్పడం కుర్రహీరోలకు కడుపుమంటగా మారిందని ఫిల్మ్ నగర్ వర్గాలు అంటున్నాయి.