కొద్ది రోజుల క్రితం చెన్నైలో జరుగుతున్న తన కొత్త సినిమా షూటింగ్‌లో పాల్గొన్న అభిషేక్.. ఓ సన్నివేశం షూటింగ్ సమయంలో గాయపడ్డారు. ఈ ప్రమాదంలో కుడి చేతికి గాయం కాగా, ఆ గాయం తీవ్రత ఎక్కువగా ఉండడంతో ముంబైలోని లీలావతి హాస్పిటల్‌లో చేర్చారు.
తండ్రి అమితాబ్ బచ్చన్, సోదరి శ్వేత బచ్చన్ నంద ఆసుపత్రికి వెళ్లి అభిషేక్‌ను పరామర్శించగా, ఆ పిక్స్ వైరల్ అయ్యాయి. అభిషేక్ కోలుకోవడంతో ఆయన.. మళ్లీ చెన్నై బయలుదేరాడు. ఈ సందర్భంగా చేతికి పెద్ద కట్టుతో ఉన్న ఫొటోను జూనియర్ బచ్చన్ షేర్ చేశాడు.
'కొత్త సినిమా సెట్స్‌లో బుధవారం పెద్ద యాక్సిడెంట్ జరిగింది. కుడి చెయ్యి విరిగింది. దీనికి సర్జరీ అవసరమైంది. అందుకే ముంబైకి క్విక్ ట్రిప్ వేయాల్సి వచ్చింది. సర్జరీ పూర్తైంది. కట్టుతోనే పని మొదలు పెట్టడానికి చెన్నై వచ్చేశాను. షో ఆగకూడదు కదా! మా నాన్న అన్నట్లు మర్ద్ కో దర్ద్ నహీ హోతా (మగవాడికి నొప్పి ఉండదు). ఓకే, ఓకే కొంచెం నొప్పిగా ఉంది. మీ విషెస్‌కు, త్వరగా కోలుకోవాలన్న మెసేజిలకు ధన్యవాదాలు' అని అభిషేక్ బచ్చన్ తన పోస్ట్‌లో పేర్కొన్నారు.