ఏపీకి చిత్ర పరిశ్రమ తరలింపు, అభివృద్ధిపై కీలక వ్యాఖ్యలు చేశారు సీనియర్ నటుడు సుమన్. ఏపీ మంత్రి అనగాని సత్యప్రసాద్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన సుమన్ మీడియాతో మాట్లాడుతూ.. ఏపీ ఎన్నికలు, ఫలితాలు, ప్రభుత్వ ఏర్పాటుతో అంతా తీరిక లేకుండా ఉండటంతో తాను ఇప్పటి వరకు ఎవరినీ కలవలేదన్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో చిత్ర పరిశ్రమకు అవకాశాలు కల్పించడం, స్టూడియోలు కట్టడమే కాకుండా మరిన్ని పనులు చేయాలని సుమన్ సూచించారు. చిన్న సినిమాలు ఆడాలంటే లొకేషన్లు కూడా బాగుండాలని, పెద్ద సినిమాలు 20 శాతం ఏపీలో తీసి మిగిలినవీ ఫారిన్‌లో తీస్తున్నారన్నారు.
బడా నిర్మాతలకు సెట్స్ వేసి షూటింగ్ చేసుకునేంత డబ్బు ఉంటుందని, కానీ చిన్న సినిమా బతకాలంటే ఏపీలో ఫిలిం సిటీ మాదిరిగా చిన్న చిన్న సెట్స్ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌లకు ఆయన సూచించారు.
తమిళం, మలయాళ ఇండస్ట్రీ వాళ్లు రాసే కథల్లో స్వేచ్ఛ ఉంటుందని, వారు ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్లి సినిమాలు తీస్తారని సుమన్ వ్యాఖ్యానించారు. కండీషన్లతో ఏపీకి సినీ పరిశ్రమ తరలిపోయే ఆస్కారం వుందని సుమన్ అన్నారు.