పెద్దలు పెళ్లిక ఒప్పుకోలేదని తనువు చాలించిన ప్రేమజంట... ఎక్కడ?

ఠాగూర్

మంగళవారం, 30 సెప్టెంబరు 2025 (09:00 IST)
పెద్దలు తమ ప్రేమ పెళ్లికి అంగీకరించలేదన్న మనస్తాపంతో ఓ ప్రేమజంట అర్థాంతరంగా తనవు చాలించింది. ప్రేమికులిద్దరూ వేర్వేరుగా ప్రాణాలు తీసుకోవడం గమనార్హం. ఈ విషాదకర ఘటన ఏపీలోని పల్నాడు జిల్లా ముప్పాళ్ల మండలం, దమ్మాలపాడులో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
ముప్పాళ్ల మండలం దమ్మాలపాడుకు చెందిన కోటె గోపీకృష్ణ (20), తెనాలి మండలం అత్తోటకు చెందిన బొల్లిముంత లక్ష్మీ ప్రియాంక (20) ఎన్ఆర్ఐటీ కళాశాలలో బీటెక్ తృతీయ సంవత్సరం చదువుతున్నారు. పేరేచర్లలో వేర్వేరు వసతి గృహాల్లో ఉంటూ గత కొన్నాళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఈ నెల 5వ తేదీన గుంటూరు పట్టాభిపురం పోలీస్ స్టేషన్‌ను వారు ఆశ్రయించారు. కొన్నాళ్లుగా ప్రేమించుకుంటున్నామని, పెళ్లి కూడా చేసుకున్నామని, తమకు రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశారు. 
 
దీంతో పోలీసులు ఇరువురి తల్లిదండ్రులను పిలిపించి మాట్లాడారు. వారు ఈ పెళ్లికి అంగీకరించకపోవడంతో తమకు ఎవరి ప్రోత్సాహం అవసరం లేదని, సొంతంగా బతుకుతామని విద్యార్థులిద్దరూ వెళ్లిపోయారు. ఈలోగా ఏం జరిగిందో తెలియదు కానీ ఈ నెల 27న సాయంత్రం గుంటూరు నుంచి మార్కాపురం వైపు వెళ్లే ఓ రైలుకు గోపికృష్ణ ఎదురుగా వెళ్లాడు.. లోకో పైలట్ గమనించి హారన్ కొడుతున్నా పట్టించుకోలేదు. దీంతో రైలు ఢీ కొని అక్కడికక్కడే మృతి చెందాడు. 
 
ఈ విషయం లక్ష్మీ ప్రియాంకకు తెలిసింది. మర్నాడు ఉదయం ఆమె కూడా అదే ప్రాంతంలో రైలు కిందపడి మృతి చెందింది. రైల్వే పోలీసులు మృతదేహాలను నరసరావుపేట ప్రాంతీయ ఆసుపత్రి తరలించారు. సోమవారం పోస్టుమార్టం నిర్వహించారు. ప్రేమ విషయంలో మనస్తాపంతోనే ఇద్దరూ బలవన్మరణానికి పాల్పడి ఉంటారని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు