అధికార అన్నాడీఎంకేను అనేక వివిదాలు చుట్టుముడుతున్నాయి. ముఖ్యంగా శశికళ జైలుకెళ్లిన తర్వాత ఆమె మేనల్లుడు టీటీవీ దినకరన్ చేతికి పార్టీ పగ్గాలు అప్పగించింది. అయితే, ఆయన అనుసరిస్తున్న వైఖరి వల్ల పార్టీ కోలుకోలేని చిక్కుల్లో పడుతుంది. దీంతో అన్నాడీఎంకేలో మరో చీలిక తప్పదనే ప్రచారం జోరుగా సాగుతోంది.
ఈ నేపథ్యంలో తమిళ హీరో అజిత్ రాజకీయాల్లోకి రావాలని డిమాండ్ చేస్తూ ఆయన అభిమానులు రాష్ట్రవ్యాప్తంగా పోస్టర్లు అంటించి కలకలం రేపారు. తమిళ చిత్రసీమలో ‘అల్టిమేట్ స్టార్’గా గుర్తింపు పొందిన అజిత్... కేవలం సినిమాల్లోనే కాకుండా కారు రేసుల్లో కూడా సత్తా చాటుతూ క్రేజ్ పెంచుకున్నారు. ముఖ్యమంత్రి దివంగత జయలలిత మరణం తర్వాత అజిత్ రాజకీయ ప్రవేశం గురించి కథనాలు వెలువడిన విషయం తెల్సిందే.
ఈ పరిస్థితుల్లో అనూహ్యంగా అజిత్ అభిమానులు కూడా తమ హీరో రాజకీయాల్లోకి రావాలంటూ నినాదం లేవనెత్తారు. వచ్చే మే 1వ తేదీన 46వ జన్మదినాన్ని జరుపుకోబోతున్న అజిత్‌కు శుభాకాంక్షలు తెలుపుతూ డిజైన చేసిన పోస్టర్లు, బ్యానర్లను ఆదివారం విడుదల చేశారు. మదురైకి చెందిన అభిమానులు అజిత్‌ను రాజకీయాలలోకి ఆహ్వానిస్తూ అంటించిన పోస్టర్లు అంటించడం చర్చనీయాంశంగా మారింది.