తన తండ్రి అల్లు అరవింద్ గురించి హీరో అల్లు అర్జున్ ఓ విషయం వెల్లడించారు. తన తండ్రిపై జరుగుతున్న దుష్ప్రచారంపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నంచేశాడు. తన తండ్రి మోసగాడు, డబ్బులు కొట్టేసేవాడు కాదనీ, పక్కా జెంటిల్మెన్ అంటూ కితాబిచ్చాడు. అందుకే నాలుగున్నర దశాబ్దాలుగా సినీ ఇండస్ట్రీలో కొనసాగుతున్నాడనీ గుర్తుచేశాడు. దీనికి కారణం పక్కా నిజాయితీపరుడు కావడమేనని చెప్పాడు. అందువల్ల తన తండ్రికి పద్మశ్రీ వచ్చేలా తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయాలని విజ్ఞప్తి చేశాడు.
తాను నటించిన తాజా చిత్రం "అల వైకుంఠపురములో..". త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం పాటల రిలీజ్ వేడుక సోమవారం రాత్రి హైదరాబాద్ నగరంలో జరిగింది. ఇందులో అల్లు అర్జున్ సూపర్బ్ స్పీచ్ ఇచ్చాడు. ఒక సందర్భంలో తన తండ్రి గురించి మాట్లాడుతూ కన్నీటిపర్యంతమయ్యాడు.
ఇందులో బన్నీ మాట్లాడుతూ, 'నన్ను లాంచ్ చేసింది మా నాన్నగారు. అప్పటి నుండి ఇప్పటి వరకు నేను 20 సినిమాలు చేశాను. వాటిలో ఏడో ఎనిమిదో ఆయన నిర్మించారు. ఆయనకు ఏనాడూ నేను సభాముఖంగా థ్యాంక్స్ చెప్పుకోలేదు. ఇంట్లో కూడా చెప్పుకోలేదు. నా లైఫ్‌లో ఫస్ట్ టైం ఇక్కడ చెబుతున్నాను.. థాంక్యూ డాడీ' అని తన తండ్రికి కృతజ్ఞతలు చెప్పాడు.
'థాంక్యూ అనేది కేవలం తనతో సినిమా తీసినందుకు కాదు' అని అంటూనే భావోద్వేగానికి గురయ్యారు బన్నీ. 'కొడుకు పుట్టిన తరవాత నాకో విషయం అర్థమైంది. నేను మా నాన్నంత గొప్పోడిని ఎప్పటికీ అవ్వలేను. ఆయనలో సగం కూడా కాలేను. మా నాన్నలో నేను సగం అయితే చాలు అనే ఫీలింగ్ వస్తుంది ఎప్పుడూ నాకు. ఈ ప్రపంచంలో మా నాన్న కన్నా నాకు ఏదీ ఎక్కువ కాదు. ఆయనతో ఈ విషయం చెప్పడానికి నాకు ఎప్పుడూ అవకాశం రాలేదు. డాడీ ఐ లవ్ యూ అని చెప్పడానికి ఇదే నాకు మంచి అవకాశం. నేనెప్పుడూ చెప్పలేదు నీకు.. థాంక్యూ థాంక్యూ' అంటూ ఏడ్చేశాడు.
తాను ఫస్ట్ సినిమా 'ఆర్య' చేసినప్పుడు సంపాదించిన మొత్తం కోటి రూపాయలని చెప్పారు. అప్పటికి తన వయసు 20 నుంచి 21 సంవత్సరాలు ఉంటుందన్నారు. 'నాకు డబ్బుకు ఎప్పుడూ లోటు లేదు. జేబులోకి సొంత డబ్బు వచ్చిన తరవాత అస్సలు లేదు. నాకు పెళ్లయిన తరవాత మా ఆవిడని ఒకే విషయం అడిగాను. నాకు ఇన్ని కోట్లు ఉన్నా నేను మా నాన్నవాళ్ల ఇంట్లో ఉంటాను నీకు ఓకేనా అని అడిగాను. మా నాన్న అంటే నాకు అంతిష్టం'. వన్ ఆఫ్ ది బెస్ట్ ఫాదర్.
అరవింద్ గారు చాలా డబ్బులు కొట్టేసేవాడని అనేవారు. ఆయన అలా కాదు. పది రూపాయల వస్తువును ఏడు రూపాయలకు బేరం చేస్తాడు. వ్యాపారి ఆరు రూపాయలకు ఇచ్చినా తీసుకోడు. ఏడు రూపాయలు ఇస్తాడు. ఇది ఆయన నైజం అంటూ నాన్నపై తనకున్న ప్రేమ చాటుకున్నాడు. పైగా, సినీ ఇండస్ట్రీలో 45 యేళ్లకు పైగా ఉంటున్నారు. ఎంతో నిజాయితీతో ఉంటేనే వ్యాపారంలో రాణిస్తాం.
మా నాన్న అలా ఉంటేనే ఇపుడు దేశంలో ఉన్న అగ్ర నిర్మాతల్లో ఒకరుగా ఉన్నారు. ఆయన సినీ ఇండస్ట్రీకి ఎంతో సేవ చేశారు. అందుకే ఆయనకు పద్మశ్రీ పురస్కారం ఇవ్వాలని, ఇందుకోసం తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయాలని ఈ సభా ముఖంగా విజ్ఞప్తి చేస్తున్నా అంటూ అల్లు అర్జున్ తన ప్రసంగాన్ని ముగించాడు.