బంగాళాఖాతంలో అల్పపీడనం : ఆరు జిల్లాలకు రెడ్ అలెర్ట్

ఠాగూర్

గురువారం, 23 అక్టోబరు 2025 (09:46 IST)
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం కారణంగా ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇది మరింతగా బలపడి గురువారం మధ్యాహాన్నికి వాయుగుండంగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ వాయుగుండం పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తాంధ్ర తీరాల వైపు రానుండటంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కుండపోత వర్షాలు తప్పవని అధికారులు అంచనా వేస్తున్నారు.
 
వాయుగుండం ముప్పు నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. వాతావరణ శాఖ ఆరు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్సార్ కడప జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అదేవిధంగా అనంతపురం, శ్రీసత్యసాయి, కర్నూలు, నంద్యాల జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, పల్నాడు జిల్లాకు ఎల్లో అలర్ట్ ప్రకటించారు. రాబోయే ఐదు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా పిడుగులతో కూడిన వర్షాలు పడతాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది.
 
ఇప్పటికే నెల్లూరు, ప్రకాశం జిల్లాలతో పాటు రాయలసీమలోని పలు ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. బుధవారం ఉదయానికి శ్రీకాళహస్తిలో అత్యధికంగా 19 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. తీరం వెంబడి గంటకు 35 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని, అందువల్ల మత్స్యకారులు శనివారం వరకు వేటకు వెళ్లవద్దని అధికారులు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.
 
మరోవైపు, తాజా పరిస్థితులపై హోంమంత్రి వంగలపూడి అనిత, విపత్తుల శాఖ స్పెషల్ సీఎస్ జి.జయలక్ష్మి ప్రభావిత జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సహాయక చర్యల కోసం ఎన్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలను సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. 
 
నెల్లూరు, ప్రకాశం, కడప, తిరుపతి జిల్లాలకు ఒక ఎన్డీఆర్ఎఫ్, నాలుగు ఎన్డీఆర్ఎఫ్ బృందాలను తరలించినట్లు తెలిపారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, ప్రతి జిల్లాలో కంట్రోల్ రూములు ఏర్పాటు చేసి ప్రజలను నిరంతరం అప్రమత్తం చేయాలని సూచించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు